Tamilnadu: 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతినిచ్చిన తమిళనాడు ప్రభుత్వం

  • ఇప్పటివరకు 50 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు
  • తమిళ సర్కారుకు సినీ ప్రముఖుల నుంచి వినతులు
  • పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం
  • మార్గదర్శకాలు తప్పనిసరి అంటూ ఆదేశాలు
Tamilnadu government gives nod to cinema theaters for full capacity audience

సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఊరటనిచ్చేలా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శనలు నిర్వహించేందుకే అనుమతి ఉంది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా నవంబరు 10 నుంచి సగం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకే కేంద్ర హోంశాఖ అనుమతి నిచ్చింది.

అయితే, విజయ్, సింబు వంటి ప్రముఖ నటులు థియేటర్లలో పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయ్ ఈ అంశంలో సీఎం పళనిస్వామిని కలిసి నిబంధనలు సడలించాలని కోరారు. సినీ రంగం నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న అన్నాడీఎంకే సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంది.

థియేటర్లు, మల్టీప్లెక్సులు ఇకపై 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రేక్షకుల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యతను సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వీకరించాలని పేర్కొంది. సినిమా ప్రదర్శనల సమయంలోనే కరోనా మార్గదర్శకాలను కూడా ప్రదర్శించాలని ఆదేశించింది.

More Telugu News