Kodali Nani: పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా: టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్

  • నాని ఇలాకాలో పేకాట దందా అంటూ మీడియాలో కథనాలు
  • సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశంగా మారిన వైనం
  • రోడ్డు పనుల కోసం సీఎం వద్దకు వచ్చానన్న కొడాలి నాని
  • ఇష్టం వచ్చినట్టు వాగొద్దంటూ టీడీపీ నేతలకు వార్నింగ్
AP Minister Kodali Nani fires on TDP leaders over gambling allegations

మంత్రి కొడాలి నాని అడ్డాలో పేకాట దందా నడుస్తోందంటూ ఒక పత్రికలో భారీ ఎత్తున కథనాలు రావడం తెలిసిందే. ఇందులో నాని బావమరిది పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం జగన్ ను కలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన కొడాలి నాని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తానంటూ హెచ్చరించారు.

తన ఇలాకాలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, తానే వాటి వెనకుండి నడిపిస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తానే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నట్టయితే పోలీసులు దాడులు చేయగలరా? అని కొడాలి నాని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం దాడులు చేయమంటేనే పోలీసులు పేకాట క్లబ్బులపై దాడులు చేశారని వెల్లడించారు. ఒకవేళ పేకాట ఆడుతూ దొరికిపోయిన వాళ్లలో తన అనుచరులు ఉన్నా, తన తమ్ముడే ఉన్నా ఇబ్బందేమీలేదని, వాళ్లకేమైనా ఉరిశిక్ష వేస్తారా? అని అన్నారు. వాళ్ల కోసం తాను సీఎం జగన్ వద్దకు పరిగెత్తుకు రావాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. పట్టుకుంటే జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు కాబట్టే హద్దు అదుపు లేకుండా పేకాట ఆడుకుంటుంటారని మంత్రి వివరించారు.

అయినా, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా పేకాట ఆడేవాళ్లకు పార్టీలు ఉంటాయా ? అని కొడాలి నాని విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన అంటూ ఇలా పార్టీల ప్రకారం పేకాట ఆడుకుంటారా? అని ప్రశ్నించారు. తాను సీఎం వద్దకు వచ్చానంటే అది పాలనకు సంబంధించిన విషయాల కోసమేనని ఉద్ఘాటించారు. గుడివాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్డు, వయా మానికొండ మీదుగా వెళ్లే రోడ్డుకు సంబంధించిన పనులను ఎన్డీబీ రెండో ఫేజ్ లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి సీఎంను కలిశానని వివరణ ఇచ్చారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన గుడివాడ ప్రజల కోసం తాను సీఎ జగన్ ను కలిశానే తప్ప పేకాటరాయుళ్ల కోసం రావాల్సిన అగత్యం తనకు పట్టలేదని అన్నారు. అలాంటి చిల్లర పనులు చేసేది చంద్రబాబు, దేవినేని ఉమ అని విమర్శించారు.

More Telugu News