Brad Haddin: గబ్బాలో ఓడిపోతామనే..  భారత జట్టుపై ఆసీస్ మాజీ కీపర్ సంచలన వ్యాఖ్యలు

  • ఆంక్షలు సడలిస్తే తప్ప బ్రిస్బేన్ వెళ్లబోమన్న భారత జట్టు
  • అలా అయితే రావొద్దంటున్న ఆ రాష్ట్ర షాడో మంత్రులు
  • భారత జట్టు కుంటి సాకులు చెబుతోందన్న హాడిన్
Brad Haddin sensational comments on Team India

నాలుగో టెస్టుకు వేదిక అయిన బ్రిస్బేన్ వెళ్లేందుకు భారత జట్టు తటపటాయిస్తుండడంపై ఆసీస్ మాజీ కీపర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉందని,  అక్కడ ఆ జట్టుపై గెలిచిన వారెవరూ లేరని అన్నాడు. ఈ విషయం తెలిసే భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని అన్నాడు. ఇందుకోసం కుంటి సాకులు చెబుతోందని విమర్శించాడు.

సిడ్నీలో కరోనా కేసులు వెలుగు చూడడంతో దానితో ఉన్న సరిహద్దును క్వీన్స్‌లాండ్ మూసేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తే కనుక తాము హోటల్ గదులకు పరిమితం కావాల్సి ఉంటుందని, కాబట్టి ఆంక్షలు సడలిస్తే తప్ప తాము బ్రిస్బేన్ వెళ్లేది లేదని భారత జట్టు తేల్చి చెప్పింది. లేదంటే, నాలుగో టెస్టును కూడా మూడో టెస్టు జరగనున్న సిడ్నీలో నిర్వహించాలని కోరింది.

భారత జట్టు అభ్యర్థనపై స్పందించిన హాడిన్ పై విధంగా వ్యాఖ్యానించాడు. క్వీన్స్‌లాండ్‌లో ఒక్క కేసూ లేదని, అలాంటప్పుడు టెస్టు మ్యాచ్‌ను మరో వేదికకు తరలించడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోందో తెలిసే భారత ఆటగాళ్లు ఇక్కడ అడుగుపెట్టారని, అక్కడ ఆంక్షలు ఉంటాయని వారికి తెలుసని అన్నాడు. ఇలాంటి ఫిర్యాదులను తామెప్పుడూ వినలేదని అన్నాడు. నా వరకు చెప్పాలంటే భారత జట్టు గబ్బాలో ఆడేందుకు ఇష్టపడడం లేదని చెబుతానని వివరించాడు.  

మరోవైపు, భారత జట్టు అభ్యర్థనపై క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ షాడో మంత్రి రాస్ బేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇక్కడకు రావాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందుకు అంగీకరిస్తేనే రావాలని, లేకపోతే వద్దని స్పష్టం చేశారు. మరోవైపు, ఆ రాష్ట్ర క్రీడాశాఖ షాడో మంత్రి టిమ్ మాండెర్ కూడా ఇలానే స్పందించారు. ఇక్కడ నిబంధనలు అందరి కోసమని, వాటిని పాటించకుండా రానవసరం లేదని స్పష్టం చేశారు.

More Telugu News