DGP: ఏపీలో వ‌రుస‌గా దేవుళ్ల విగ్ర‌హాల ధ్వంసం నేప‌థ్యంలో పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన డీజీపీ

  • ప్రార్థనా మందిరాల వద్ద  నిరంతరం నిఘా
  • పూజారులు, ఆలయ నిర్వాహకులు కూడా అప్రమత్తంగా ఉండాలి
  • దేవాలయాల‌న్నింటినీ జియో ట్యాగింగ్ చేయాలి
  •  కొంత మంది ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం
dgp warns about ruckus in temples

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌రుస‌గా దేవుళ్ల విగ్ర‌హాల ధ్వంసం ఘ‌ట‌న‌లు న‌మోదు అవుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ పోలీసుల‌తో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేసి అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్ చేయాల‌ని పోలీసుల‌కు సూచించారు.

అలాగే, పూజారులు, ఆలయ నిర్వాహకులు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయ‌న అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎవ‌రైనా గుర్తిస్తే పోలీసులకు వెంట‌నే స‌మాచారం అందించాల‌ని చెప్పారు. దేవాలయాల వ‌ద్ద‌ భద్రతా చర్యలను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు స‌వాంగ్  ఆదేశాలు జారీ చేశారు.

దేవాలయాల‌న్నింటినీ జియో ట్యాగింగ్‌ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే క‌ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

కాగా, విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. బోడికొండ మెట్ల దిగువభాగంలో గత ఐదు రోజులుగా బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేస్తున్న దీక్షను ఈ రోజు ఉద‌యం పోలీసులు భగ్నం చేశారు. వారిని వేరు వేరు ప్రాంతాలకు తరలించారు. రామతీర్థంలో ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని డిసెంబరు 29న గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే .

More Telugu News