Australia: ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్ పై సందిగ్ధత!

  • మిగిలివున్న రెండు టెస్టులు
  • కొత్త కరోనా కేసులు, ఆటగాళ్ల నిబంధనల ఉల్లంఘన
  • మ్యాచ్ అవకాశాలు తక్కువేనని మీడియాలో వార్తలు
  • ప్రొటోకాల్ ఉల్లంఘించిన ప్లేయర్లపై ఫైన్
Doubt on Test Series in Australia

ఆస్ట్రేలియాతో తదుపరి జరగాల్సిన రెండు టెస్టులపై సందిగ్ధత నెలకొంది. ఆటగాళ్లు కొవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం, మ్యాచ్ జరిగే నగరంలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. సోమవారం నాడు రెండు జట్లూ న్యూ సౌత్ వేల్స్ కు వెళ్లాల్సి వుంది. అక్కడ 8 కొత్త కేసులు వచ్చాయి.

ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు పార్టీ చేసుకుని ఐసొలేషన్ లోకి వెళ్లిన విషయంపై విచారణ ప్రారంభమైంది. ఇక క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రం, న్యూ సౌత్ వేల్స్ నుంచి వచ్చే అన్ని సరిహద్దులనూ మూసివేసింది. నాలుగో టెస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి వుండగా, ఆటగాళ్లపై ఎటువంటి నిబంధనలు ఉంటాయన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

టెస్ట్ సిరీస్ కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆటగాళ్లలో చాలా మంది ఏదో ఓ రూపంలో క్వారంటైన్ లో ఉండటం, మరికొందరు కేసులు అధికంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ఇష్టపడక పోతుండటం కూడా మ్యాచ్ నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది. ఆస్ట్రేలియాకు రాగానే ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ ను అనుభవించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత ఆటగాళ్లకు కొంత రిలాక్సేషన్ ఇచ్చినా, బయో బబూల్ లోనే ఉండాలన్న నిబంధన విధించారు. అయితే, ఐదుగురు ఆటగాళ్లు కొత్త సంవత్సరం రోజున బయటకు వచ్చి, మెల్ బోర్న్ లోని ఓ రెస్టారెంట్ లో తింటున్న వీడియో వైరల్ అయింది. దీన్ని అటు ఆసీస్, ఇటు భారత క్రికెట్ బోర్డులు సీరియస్ గా తీసుకున్నాయి. ఆటగాళ్లు ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో, వారిపై జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని బోర్డు అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా, న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ జాన్ బారిలారో మాత్రం, మూడవ టెస్ట్ ను జరిపించేందుకు తాము అన్ని ఏర్పాట్లూ చేశామని, దాదాపు 20 వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఉన్నామని ఆదివారం నాడు మీడియాకు తెలిపారు. మ్యాచ్ ని నిర్వహించే అవకాశం తమ ముందుకు వస్తే, దాన్ని అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు.

ఇదే విషయమై ఆసీస్ ఆటగాడు మ్యాథ్యూ వేడ్ స్పందిస్తూ, బ్రిస్ బేన్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని అన్నారు. మిగతా మ్యాచ్ లు జరుగుతాయనే భావిస్తున్నానని అన్నారు.

More Telugu News