Office: ఆఫీసులో నిద్రపోతే క్రమశిక్షణా చర్యలు... ముసాయిదాపై అభిప్రాయాలు కోరిన కేంద్రం!

Disiplenary Action for Office Sleeping
  • ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020కి మార్పులు
  • సెక్షన్ 29లో స్టాండర్డ్ ఆర్డర్స్ జారీ
  • ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకునే
  • అభిప్రాయాలకు 30 రోజుల గడువు

ఇకపై ఆఫీసుల్లో పని చేస్తున్న వేళ, నిద్రపోతే అది దుప్ప్రవర్తనేనని, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంటూ కేంద్ర కార్మిక శాఖ ఓ ముసాయిదాను తయారు చేసి, ప్రజలు, వివిధ సంఘాల అభిప్రాయాలు, సూచనలు కోరుతూ, అందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. మొత్తం 23 వ్యవహారాలు దుష్ప్రవర్తనేనని, పేర్కొంటూ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లోని సెక్షన్ 29లో స్టాండర్డ్ ఆర్డర్స్ ను జారీ చేసింది.

ఈ దిశగా నోటిఫికేషన్ ను జారీ చేసిన కార్మిక శాఖ, సేవలకున్న ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాగా, ఉద్యోగుల విషయంలో ఈ విధంగా నిబంధనల ముసాయిదా తయారు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉద్యోగి ప్రవర్తన సరిగ్గా లేకుంటే, విచారణ పూర్తి కాకుండానే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం లభిస్తుంది. నియామకం సమయంలో ఉద్యోగికి, యజమాని మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం పని గంటలు ఉంటాయని కూడా కార్మిక శాఖ స్పష్టం చేసింది.

ఇక దుష్ప్రవర్తన కిందకు వచ్చే అంశాల్లో దొంగతనం, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడటం, మోసం, స్వీయ ప్రయోజనాల కోసం లంచాలు ఇవ్వడం, తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎదురు మాట్లాడటం, చెప్పిన మాట వినకపోవడం ఉన్నతాధికారుల ఆదేశాలు ధిక్కరించడం, విధులకు ఆలస్యంగా రావడం, సెలవు తీసుకోకుండా గైర్హాజరు వంటి వాటిని చేర్చారు. వీటితో పాటు తరచూ గైర్హాజరు, మద్యం తాగి విధులకు రావడం, అమర్యాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం, యజమాని ఆస్తికి నష్టం కలిగించడం, నిద్రపోవడం, నెమ్మదిగా పనిచేయడం వంటి వాటిని కూడా చేర్చారు.

అంతే కాదు... లేని జబ్బు ఉన్నట్టు నటించడం, కింది ఉద్యోగుల నుంచి బహుమతులు తీసుకోవడం, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, అనుమతి తీసుకోకుండా లేదా స్పష్టమైన కారణం లేకుండా పది రోజులకు మించి సెలవు పెట్టడం, ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, కారణం లేకుండా పని వదిలివెళ్లడం, పై అధికారులను బెదిరించడం, హింసకు పురిగొల్పేలా మాట్లాడటం, 14 రోజుల నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగడం వంటి వాటిని కూడా జోడించారు.

రహస్య సమాచారాన్ని బయటి వారికి చెప్పడం, చార్జ్ షీట్ లేదా నోటీసులను ఉద్దేశపూర్వకంగా స్వీకరించక పోవడం, భద్రతా పరికరాలను ధరించకపోవడం లేదా తిరస్కరించడం, వివిధ రకాల రీయింబర్స్ మెంట్ కోసం తప్పుడు బిల్లులు పెట్టడం వంటి వాటన్నింటినీ దుష్ప్రవరివర్తన కింద జోడిస్తూ కార్మిక శాఖ ముసాయిదాను తయారు చేసింది.

  • Loading...

More Telugu News