Chandrababu: జగన్, విజయసాయిరెడ్డి, కొడాలి నానిలపై చంద్రబాబు ఫైర్

Chandrababu fires on Jangan and Vijayasai Reddy
  • విజయసాయిరెడ్డిలాంటి చోటా, మోటా నాయకులను చాలా మందిని చూశాను
  • సీఎం హోదాలో ఉండి మత మార్పిడులకు పాల్పడాలనుకోవడం దారుణం
  • విగ్రహాలు చోరీ అయితే ఏమవుతుందని ఓ బూతుల మంత్రి అన్నాడు
ఉత్తరాంధ్ర అయోధ్యగా కొలుచుకునే రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా శ్రీరాముడికి అవమానం జరగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు.

టీడీపీ హయాంలో ఒక్క ప్రార్థనాలయంపై కూడా దాడి జరగలేదని అన్నారు. ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. రామతీర్థంలో విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని ఈరోజు చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రామతీర్థం, ఒంటిమిట్ట దేవాలయాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని చంద్రబాబు అన్నారు. 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలను నిర్మించారని చెప్పారు. దేవుడి ఆస్తులపై కన్నేసేవారు, వాటిని ధ్వంసం చేసేవారు మసైపోతారని అన్నారు. దేవాలయాలకు వెళ్లి అన్యమత ప్రచారం చేస్తున్నారని... అంత పరమత విద్వేషం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ మంత్రి ఉన్నాడా? లేడా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

రామతీర్థంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏం పని? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి చోటా, మోటా నాయకులను తన జీవితంలో ఎంతో మందిని చూశానని ఎద్దేవా చేశారు. పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయంలోకి విజయసాయిని అనుమతించారని... తనను అడుగడుగునా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.

ఎస్వీబీసీ ఛానల్ లో ఓ వైసీపీ నేత శృంగారం చేశాడని చంద్రబాబు విమర్శించారు. విగ్రహాలు చోరీ అయితే ఏమవుతుందని ఓ బూతుల మంత్రి దారుణ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత మార్పిడిలకు పాల్పడాలనుకోవడం దారుణమని అన్నారు. దేవుడి ఆస్తుల జోలికి వస్తే మసైపోతారని మండిపడ్డారు. గోశాలలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కేసును ఓపెన్ చేయిస్తానని... తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
Chandrababu
Telugudesam
Jagan
Vijayasai Reddy
Kodali Nani
YSRCP

More Telugu News