Team India: గీత దాటారు... ఐసోలేషన్ లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు

  • ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా
  • బయోసెక్యూర్ బబుల్ లో ఆటగాళ్లు
  • న్యూ ఇయర్ రోజున రెస్టారెంటులో విందు
  • రోహిత్, పంత్, గిల్, షా, సైనీలకు ఐసోలేషన్
  • విచారణ జరపనున్న బీసీసీఐ, సీఏ
Five Team India players put on isolation as precaution

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్ మెంట్ ఐసోలేషన్ లో ఉంచింది. ఈ ఐదుగురు ఆటగాళ్లు నూతన సంవత్సరాది సందర్భంగా మెల్బోర్న్ నగరంలోని ఓ ఇండోర్ రెస్టారెంటులో విందు ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వెల్లడైంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా వీరిని జట్టులోని ఇతర సభ్యులకు దూరంగా ఉంచారు.

దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) ఓ ప్రకటన విడుదల చేసింది. "ఆస్ట్రేలియా, భారత జట్ల వైద్య బృందాల సలహా మేరకు టూర్ మధ్యలో కొందరు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లో ఉంచుతున్నాం. ప్రయాణాల్లోనూ, సాధన సమయంలోనూ వీళ్లు భారత, ఆస్ట్రేలియా జట్లకు దూరంగా ఉంటారు" అని వివరించింది. ఈ ఘటనపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణ జరుపుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో సెక్యూర్ బబుల్ లో ఉండాల్సిన ఆటగాళ్లు విందు కోసం బయటికి ఎలా వెళ్లారన్న దానిపై నిగ్గు తేల్చనున్నారు.

కాగా, మెల్బోర్న్ లో టీమిండియా ఆటగాళ్లు రెస్టారెంట్ లో భోజనం చేయగా, ఆ బిల్లును ఓ అభిమాని చెల్లించడం తెలిసిందే. ఆ అభిమానిని పంత్ ఆత్మీయంగా హత్తుకున్న విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇది బయో సెక్యూర్ ప్రోటోకాల్ ఉల్లంఘన అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనను పంత్ హత్తుకున్నట్టు నిర్ధారణ అయితే ఆటగాళ్లు చిక్కుల్లో పడతారని భావించిన ఆ అభిమాని... పంత్ తనను అస్సలు హత్తుకోలేదని, తానే ఉద్వేగానికి లోనై అలా చెప్పానని ట్వీట్ చేశాడు.

More Telugu News