Chandrababu: గర్భగుడిలోకి విజయసాయిరెడ్డిని అనుమతించి.. చంద్రబాబును అనుమతించని అధికారులు!

Rama Theertham temple officials closed gates when Chandrababu reached there
  • రామతీర్థం గర్భ గుడిలో పూజలు నిర్వహించిన విజయసాయి
  • చంద్రబాబు వెళ్లే సమయానికి గుడికి తాళం వేసిన అధికారులు
  • విచారణ జరుగుతుండటంతో తాళం వేశామని సమాధానం
విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని చూసేందుకు చంద్రబాబు అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన కొండపైకి వెళ్లక ముందే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పైకి వెళ్లొచ్చారు. విజయసాయి ఆలయం వద్దకు వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు.

అయితే, చంద్రబాబు వెళ్లినప్పుడు మాత్రం అధికారులు ఆలయానికి తాళం వేశారు. తాళం ఎందుకు వేశారని ప్రశ్నిస్తే... విచారణ జరుగుతోందని సమాధానమిచ్చారు. దీంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహాలను ఆయన వెలుపలి నుంచే పరిశీలించారు. రాముడి విగ్రహం తలను దుండగులు విసిరేసిన కోనేరును కూడా పరిశీలించారు. చంద్రబాబుకు ఆలయంలోకి అనుమతి ఇవ్వక పోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేవలం రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డికి ఏ హోదాతో అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నాయి. ఆలయ అధికారులు, పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
YSRCP
Rama Theertham

More Telugu News