vaccine: భార‌త్ లో తొలి విడతలో ఉచితంగా వ్యాక్సిన్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్

  • మూడు కోట్ల మందికి పంపిణీ
  • ఆ తర్వాత‌ మ‌రో 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌
  • ఈ రోజు వ్యాక్సిన్ డ్రైరన్‌ జరుగుతోంది
  • వ‌దంతులు వ్యాపిస్తున్నాయి.. న‌మ్మెద్దు
3 crore people get free vaccine

దేశంలో త్వ‌ర‌లోనే క‌రోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు తెలిపారు. భార‌త్ లో తొలి విడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

తొలి విడ‌త‌లో కోటి మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు మ‌రో రెండు కోట్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ తదుపరి విడ‌త‌లో మ‌రో 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు వ్యాక్సిన్ డ్రైరన్‌ జరుగుతుంద‌ని గుర్తు చేశారు.

అయితే, ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్‌పై చాలా వదంతులు వ్యాపిస్తున్నాయ‌ని, అటువంటి వాటిని న‌మ్మొద్ద‌ని చెప్పారు. తాము దేశంలో వ్యాక్సిన్ సామర్థ్యంతో పాటు  భద్రత, రోగనిరోధకతకు ప్రాధాన్యత‌నిస్తున్నామ‌ని తెలిపారు. అప్ప‌ట్లో పోలియో వ్యాక్సిన్ ఇస్తున్న సమయంలోనూ ఇటువంటి వదంతులే వ‌చ్చాయ‌ని చెప్పారు. కాగా, దేశంలో 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్ ఈ రోజు కొన‌సాగుతోంది.

More Telugu News