Flight Accidents: గతేడాది విమాన ప్రమాదాలు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి!

Aviation deaths rise worldwide in 2020 even as fatal incidents flights fall
  • 2019తో పోలిస్తే 2020లో సగం తగ్గిన ప్రమాదాలు
  • 40 విమానాలు కూలిపోయన ఘటనల్లో 299 మంది బలి
  • 2019లో 86 ప్రమాదాలకు 257 మంది మృతి
  • ‘టూ70’ అనే ఏవియేషన్ సంస్థ నివేదికలో వెల్లడి 
  • అత్యంత భద్రమైన ఏడాదిగా 2017
గత ఏడాది విమాన ప్రమాదాలు తగ్గినా.. మరణాలు మాత్రం ఎక్కువగా నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 2020లో 40 విమాన ప్రమాదాలు జరగ్గా 299 మంది మరణించారు. అయితే, అంతకుముందు ఏడాది జరిగిన ప్రమాదాలతో పోలిస్తే.. ప్రమాదాలు 50 శాతం తగ్గాయి. 2019లో 86 ప్రమాదాలు జరిగి 257 మంది చనిపోతే.. 2020లో 40 ప్రమాదాలే జరిగినా 299 మంది మరణించారు. ‘టూ70’ అనే విమానయాన సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

మొత్తం మరణాల్లో సగానికి పైగా ఉక్రెయిన్ విమాన ప్రమాదంలోని వారేనని నివేదిక పేర్కొంది. జనవరిలో ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ ప్రయాణికుల విమానాన్ని ఆ దేశం కూల్చేయడంతో 176 మంది చనిపోయారు. తర్వాత పాకిస్థాన్ లో మేలో జరిగిన విమాన ప్రమాదంలో 98 మంది చనిపోయారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో అన్ని దేశాలూ విమాన సర్వీసులను నిలిపేశాయని, దాని వల్లే ప్రమాదాలు తగ్గాయని ఫ్లైట్ రాడార్ 24 అనే విమానాల రాకపోకలను ట్రాక్ చేసే సంస్థ తెలిపింది. మొత్తంగా పోయినేడాది విమాన సర్వీసులు 42 శాతం మేర తగ్గాయని, 2.44 కోట్ల ప్రయాణాలే జరిగాయని వెల్లడించింది.

కాగా, గత రెండు దశాబ్దాల్లో విమాన ప్రమాదాల్లో మరణాలు చాలా వరకు తగ్గాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) వెల్లడించింది. 2005లో అత్యధికంగా ఒకే ఏడాది 1,015 మంది చనిపోయినట్టు చెప్పింది. గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 14 ప్రాణాంతక విమాన ప్రమాదాలు జరిగాయని, సగటున 345 మంది చనిపోయారని పేర్కొంది.

మొత్తంగా ఏవియేషన్ చరిత్రలోనే 2017 భద్రమైన సంవత్సరంగా ఏఎస్ఎన్ పేర్కొంది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రాణాంతక ప్రమాదాలే జరగ్గా.. కేవలం 13 మంది చనిపోయారంది. 2009 ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఒక్క ప్రమాదమూ జరగలేదని పేర్కొంది.
Flight Accidents
Ukraine Flight Crash

More Telugu News