Cold Wave: ఉత్తరాది గజగజ.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పలు నగరాల్లో మైనస్​ లోకి!

Great Friday freeze Sub zero temperatures in 3 cities even in plains
  • అత్యల్పంగా హిసార్ లో మైనస్ 1.2 డిగ్రీలు
  • చురూ, బటిండాల్లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత
  • లానినా ప్రభావం వల్లేనన్న భారత వాతావరణ శాఖ అధిపతి
ఉత్తరాదిని చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మైనస్ లోకి జారుకున్నాయి. పొగమంచు దట్టంగా అలముకుంటోంది. కనీసం మీటర్ దూరంలోని వస్తువులు, మనుషులు కనిపించని పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి.

హర్యానాలోని హిసార్ లో అత్యల్పంగా మైనస్ 1.2 డిగ్రీల శీతోష్ణ పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ లోని చురూ, పంజాబ్ లోని బటటిండాలో మైనస్ 0.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు సున్నాకు చేరువయ్యాయి. పంజాబ్ లోని ఫరాద్ కోట్, హర్యానాలోని నార్నౌల్ లో 0.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్ నవూలో 0.5 డిగ్రీలు, ఢిల్లీలో 1.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

కాగా, గత కొన్నేళ్లలో ఇంతలా చలి పెరిగిపోవడం ఇదే తొలిసారి. మునుపెన్నడూ లేనంతగా వివిధ నగరాల్లో ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ లోని శిఖర్, నార్నౌల్ లో మైనస్ 0.5 డిగ్రీల శీతల పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ చివరి వారంలో పిలానీలో అత్యల్పంగా 0.2 డిగ్రీలు, అమృత్ సర్ లో 0.4 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

‘‘ఈ శీతాకాలంలో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ముందే చెప్పాం. డిసెంబర్ తొలి వారంలోనే వాతావరణానికి సంబంధించి అంచనాలను వివరించాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లానినా ప్రభావం ఉంది. పసిఫిక్ మహా సముద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఇది ఏర్పడుతుంది. లానినా ఉన్నప్పుడు చలి విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో చలి ఎక్కువగా ఉండడానికి కారణం కూడా అదే’’ అని భారత వాతావరణ శాఖ అధిపతి మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.

ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. మేఘాలు లేకుండా ఆకాశం నిర్మలంగా ఉండడంతో రాత్రి పూట వెంటనే చల్లగా మారిపోతోందని చెప్పారు.
Cold Wave
IMD

More Telugu News