DMK: చెన్నైలో డీఎంకే మహానాడు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌కు ఆహ్వానం

  • అసద్‌కు ఆహ్వానంపై మండిపడుతున్న తమిళ మైనారిటీ నేతలు, ప్రజలు
  •  బీహార్‌లో బీజేపీ విజయానికి బాటలు వేశారంటూ ఆరోపణలు
  • విమర్శలతో వెనక్కి తగ్గిన డీఎంకే
DMKs invite to Owaisi upsets workers of TN Muslim parties

తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే ఈ నెల 6న చెన్నైలో నిర్వహించనున్న మహానాడుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌కు ఆహ్వానం అందింది. రాయపేటలోని వైఎంసీఏ మైదానంలో ‘హృదయాలను కలుపుదాం’ పేరిట నిర్వహించనున్న మహానాడుకు రావాల్సిందిగా డీఎంకే మైనారిటీ సంక్షేమ విభాగం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఆహ్వానించగా, అసద్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

 అసద్‌కు డీఎంకే ఆహ్వానంపై రాష్ట్రంలోని ఇతర ఇస్లామిక్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. డీఎంకే మైనారిటీ సంక్షేమ విభాగ కార్యదర్శి అయిన డాక్టర్ డి మస్తాన్ శుక్రవారం ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు వక్కిల్ అహ్మద్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒవైసీని కలిశారు. ఈ సందర్భంగా మహానాడుకు ఆహ్వానించారు. అసద్‌ను కలిసిన విషయాన్ని అహ్మద్ నిర్ధారించారు.

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులోని ముస్లింలు ఒవైసీపై విరుచుకుపడ్డారు. అక్కడ పోటీ చేయడం ద్వారా ప్రతిపక్షాల ఓట్లను చీల్చి, బీజేపీ గెలవడానికి కారణమయ్యారని ఆరోపించారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళ సోషల్ మీడియాలో ఒవైసీకి వ్యతిరేకంగా కొన్ని రోజులపాటు పోస్టులు వెల్లువెత్తాయి. ఒవైసీని చాలామంది బీజేపీ-బి టీంగా అభివర్ణించారు. అయితే, ఆయనకు అనుకూలంగానూ కొందరు గళమెత్తారు.

తాజాగా, ఒవైసీని మహానాడుకు ఆహ్వానించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. డీఎంకే ఆహ్వానంపై ముస్లిం నేతలు పెదవి విరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకున్నా డీఎంకేకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండబోదని చెబుతున్నారు. ఎంఐఎంకు ఇక్కడ ఎలాంటి ఆదరణ లేదని, ఆయన వల్ల డీఎంకేకు ముస్లింల నుంచి ఎక్కువ ఓట్లు వస్తాయనుకోవడం భ్రమేనని తిరుచ్చికి చెందిన నూర్ మహమ్మద్ పేర్కొన్నారు. కాగా, అసద్‌కు ఆహ్వానంపై డీఎంకే క్షేత్రస్థాయి కార్యకర్తలతోపాటు మిత్ర పక్షాలైన ఐయూఎంల్, మనిథనేయ మక్కల్ కచ్చి పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి.

అసద్‌కు ఆహ్వానంపై పార్టీలో విమర్శలు వినిపిస్తుండడంతో గతరాత్రి పొద్దుపోయాక డీఎంకే స్పందించింది. కూటమి పార్టీలను మాత్రమే మహానాడుకు ఆహ్వానించామని, ఇతర పార్టీలకు ఆహ్వానం లేదని స్పష్టం చేసింది.

More Telugu News