ATM: ఏటీఎంలో చోరీకి యత్నం.. విఫలం కావడంతో నిప్పు, బూడిదైన రూ. 5.80 లక్షలు!

Youth sets fire to ATM after theft unsuccessful
  • అనంతపురం జిల్లా పరిగి మండలంలో ఘటన
  • పెట్రోలు పోసి ఏటీఎంకు నిప్పు
  • నిందితుల్లో ఒకరి ఆత్మహత్య
ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులు తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో నిప్పంటించారు. ఫలితంగా ఏటీఎంలోని రూ. 5.80 లక్షల నోట్లు కాలి బూడదయ్యాయి. అనంతపురం జిల్లా పరిగి మండలంలోని కొడిగెనహళ్లిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో గురువారం రూ.9 లక్షల నగదు పెట్టగా, అందులో రూ. 3 లక్షలను ఖాతాదారులు డ్రా చేశారు. ఆ రోజు రాత్రి మరో రూ. 22 వేలు డ్రా అయ్యాయి. ఆ రాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. దీంతో ఆగ్రహంతో పెట్రోలు పోసి ఏటీఎంను తగలబెట్టారు.

నిన్న ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు అందులోకి చొరబడినట్టు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏటీఎంలో చోరీకి యత్నించిన వారిలో ఒకడిగా అనుమానిస్తున్న మనోజ్‌కుమార్ (21) ఆబాద్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ATM
Anantapur District
Parigi

More Telugu News