Pakistan: దుండగులు కూల్చేసిన ఆ హిందూ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తాం: పాకిస్థాన్ 

  • హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టిన స్థానికులు
  • పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • 26 మంది అరెస్ట్, 350 మందిపై ఎఫ్ఐఆర్
Pakistan govt ordered to to built hindu temple

ఇస్లామిక్ కంట్రీ అయిన పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఖైబర్ పక్తుంఖ్వా, కరక్ జిల్లాలోని టెర్రీ గ్రామంలో దుండగులు కూల్చేసిన హిందూ దేవాలయాన్ని పునర్నిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహ్మద్ ఖాన్ నిన్న ప్రకటించారు. ఆలయ నిర్మాణంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.  

టెర్రీ గ్రామంలోని హిందూ దేవాలయంపై దాడిచేసిన కొందరు దానిని ధ్వంసం చేసి తగలబెట్టారు. బుధవారం ఘటనా ప్రాంతానికి సమీపంలో జామియత్ ఉలేమా ఇ ఇస్లాం ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ఉద్రేకంతో ఊగిపోయిన జనం హిందూ దేవాలయానికి చేరుకుని విధ్వంసం సృష్టించారు.  పరమహంసజీ మహరాజ్ సమాధిని, కృష్ణ మందిర ద్వారాన్ని ముస్లింలు ధ్వంసం చేశారు.

దేవాలయ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ నిరసన వ్యక్తం చేసింది. మానవహక్కుల సంఘాలు, హిందూ సంఘాలు కూడా నిరసన తెలిపాయి. మైనారిటీ ప్రజా ప్రతినిధి రమేశ్ కుమార్ ఈ విషయాన్ని పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అలాగే, ర్యాలీ నిర్వహించి ఘటనకు కారణమైన   జామియత్ ఉలేమా ఇ ఇస్లాం నేత రహ్మత్ సలామ్ ఖట్టక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 350 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందూ మందిరం కూల్చివేతపై పాక్ సుప్రీంకోర్టు కూడా ఆరా తీసింది. ఈ నెల 5న విచారణ చేపట్టనుంది.

More Telugu News