మమతకు మరో షాక్.. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి సోదరుడు

01-01-2021 Fri 19:23
  • బీజేపీలో చేరిన కంతి మున్సిపల్ ఛైర్ పర్సన్ సౌమేందు అధికారి
  • తనతో పాటు డజను మంది కౌన్సిలర్లను తీసుకెళ్లిన వైనం
  • ప్రతి ఇంట్లో కమలం వికసిస్తుందన్న సౌమేందు
After Suvendu Adhikari His Brother Quits Trinamool And Joins BJP

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేత సువేందు అధికారితో పాటు పలువురు నేతలు టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కు మరో షాక్ తగిలింది. సువేందు అధికారి చిన్న సోదరుడు సౌమేందు అధికారి కూడా పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు.

సౌమేందు అధికారి ప్రస్తుతం తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని వారి స్వస్థలం కంతి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. కనీసం ఒక డజను మంది టీఎంసీ కౌన్సిలర్లతో కలసి ఆయన తన సోదరుడు సుమేందు సమక్షంలో బీజేపీలో చేరారు. సువేందు అధికారి ఇంట్లో మరో ఇద్దరు ఇప్పటికీ టీఎంసీలోనే ఉన్నారు. వారిలో ఒకరు తండ్రి శిశిర్ అధికారి కాగా, మరొకరు సోదరుడు దివ్యేందు అధికారి.

ఇదే విషయంపై మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సెటైర్లు వేశారు. 'సొంత ఇంట్లోనే కమలాన్ని వికసింప చేయలేని వ్యక్తి... మొత్తం బెంగాల్ లో కమలాన్ని వికసింప చేస్తాడట' అని ఎద్దేవా చేశారు. దీనిపై సువేందు అదే స్థాయిలో ప్రతిస్పందించారు. కమలం కేవలం తన ఇంట్లోనే కాకుండా కోల్ కతాలోని హరీశ్ ముఖర్జీ, హరీశ్ ఛటర్జీ వీధుల్లో కూడా వికసిస్తుందని అన్నారు. మమతా బెనర్జీ హరీశ్ ఛటర్జీ స్ట్రీట్ లో, దానికి సమీపంలోనే ఉన్న హరీశ్ ముఖర్జీ స్ట్రీట్ లో అభిషేక్ బెనర్జీ నివసిస్తుండటం గమనార్హం. మరోవైపు సౌమేందు అధికారి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో కమలం వికసిస్తుందని అన్నారు.