Iran: మాపై దాడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు: ఇరాన్

Iran accused Trump that he is trying to attack us
  • యుద్ధ నౌకలు, బాంబర్లను మోహరిస్తున్నారు
  • అలజడి సృష్టించేందుకు మిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారు
  • ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మా వద్ద ఉంది
తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా యత్నిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జరీఫ్ ఆరోపించారు. దాడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. తమ దేశానికి సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు, బీ52ఎస్ బాంబర్లను మోహరిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తమ వద్ద ఉందని అన్నారు. కరోనాపై యుద్ధం చేయడం మానేసి, తమపై దాడికి ట్రంప్ యత్నిస్తున్నాడని చెప్పారు. తమ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ మిలిటరీ సలహాదారుడు మాట్లాడుతూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సంవత్సరాన్ని అమెరికన్లకు శోక సంవత్సరంగా మార్చవద్దని అన్నారు. ఇటీవలి కాలంలో అమెరికాకు, ఇరాన్ కు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానిని అమెరికా బలగాలు హతమార్చిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు దేశాలు పరస్పర క్షిపణి దాడులకు కూడా పాల్పడ్డాయి.
Iran
USA
WAR

More Telugu News