Chris Gayle: రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన 'యూనివర్స్ బాస్' 

  • ఇటీవల ఐపీఎల్ లో రాణించిన క్రిస్ గేల్
  • ఇప్పట్లో రిటైరయ్యేది లేదని స్పష్టీకరణ
  • మరో రెండు వరల్డ్ కప్ లు ఆడతానని వెల్లడి
  • మరో ఐదేళ్ల వరకు ఫిట్ నెస్ కు ఢోకా లేదని ధీమా
Universe Boss Chris Gayle opines on his retirement plans

క్రికెట్ రంగంలో 'యూనివర్స్ బాస్' గా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో పంచుకున్నాడు. 41 ఏళ్ల వయసులోనూ ధాటిగా ఆడే క్రిస్ గేల్ తాను ఇప్పట్లో రిటైరయ్యేది లేదని స్పష్టం చేశాడు. తాను ఇంకా రెండు వరల్డ్ కప్ లు ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ లోనే కాదు, 2022లో ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలోనూ ఆడతానని వివరించాడు.

క్రీజులో తన కదలికలపై ఎంతో సంతృప్తిగా ఉన్నానని, తన ఫిట్ నెస్ ను బట్టి మరో ఐదేళ్లు ఆడగలనన్న నమ్మకం కలుగుతోందని గేల్ తెలిపాడు. ఇప్పటివరకైతే రిటైర్ అవ్వాలన్న ఆలోచన లేదని, 45 ఏళ్ల వయసు రాకముందే రిటైరవడం జరగదని స్పష్టం చేశాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్ లో గేల్ 41.14 సగటుతో 288 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ రేట్ 137 అంటేనే గేల్ తడాఖా ఏంటో అర్థమవుతుంది. తన కెరీర్ లో 103 టెస్టులాడిన గేల్ 7,214 పరుగులు సాధించాడు. 301 వన్డేల్లో 10,480... 411 టీ20 మ్యాచ్ ల్లో 13,584 పరుగులు సాధించి ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడిగా నిలిచాడు.

More Telugu News