Bandi Sanjay: ఓడిపోయిన కార్పొరేటర్లతో శంకుస్థాపనలకు మంత్రులు సిగ్గులేకుండా హాజరవుతున్నారు: బండి సంజయ్

  • గవర్నర్ తో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు
  • జీహెచ్ఎంసీ నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్న సంజయ్
  • ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ తొత్తుగా మారారని ఆరోపణ
  • వెంటనే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్
Bandi Sanjay and BJP leaders met governor

తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ, తక్షణమే జీహెచ్ఎంసీ నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా కుంటిసాకులు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని, దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపైనా, రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా ధ్వజమెత్తారు.

ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ తొత్తుగా మారారని ఆరోపించారు. ఇప్పటివరకు జీహెచ్ఎంఎసీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం అంటే ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్లను అవమానించడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్, ఒవైసీల ఒత్తిడి మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రూపొందించిందని ఆరోపించారు. బీజేపీ బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతోనే హడావిడిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.  

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి నెల రోజులు అవుతున్నా పాలకమండలి ఏర్పాటు చేయకపోవడం దారుణమని, రాజ్యాంగం అనుసరించి వెంటనే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోయిన కార్పొరేటర్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలకు మంత్రులు సిగ్గులేకుండా హాజరవుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కానీ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను మాత్రం ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంట నక్కలు, దోపిడీ దొంగల్లా వ్యవహరిస్తున్నారని, ప్రణాళిక ప్రకారం దోపిడీకి పాల్పడుతున్నారని వివరించారు. వారి దోపిడీ ప్రణాళిక పూర్తయ్యేంత వరకు జీహెచ్ఎంసీలో కొత్త పాలకవర్గాన్ని అనుమతించొద్దని నిర్ణయించుకున్నారని మండిపడ్డారు.

More Telugu News