Corona Virus: కరోనాతో కన్నుమూసిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి

  • గత నెల 13న అపోలో ఆసుపత్రిలో చేరిన రామకృష్ణారెడ్డి
  • వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి
  • 2019లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిక
YCP MLC Challa Ramakrishna Reddy died with Corona

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆయన గత నెల 13న హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం కర్నూలు జిల్లా అవుకు మండలంలోని ఉప్పలపాడు.

1983లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో డోన్ నుంచి బరిలోకి దిగిన ఆయన పరాజయం పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. 1994లో కోవెలకుంట్ల నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. అయితే, 1999, 2004లలో మాత్రం భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.

2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ రాకపోవడంతో టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లయిస్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు.

More Telugu News