Kurnool District: ఆదోనిలో దారుణం.. పట్టపగలే పరువు హత్య!

Honour killing in Nandyal Kurnool dist
  • నెలన్నర క్రితం ప్రేమ వివాహం
  • కేకు తీసుకుని ఇంటికి వెళ్తుండగా అడ్డగించిన దుండగులు
  • ఇనుపరాడ్డుతో దాడి చేసి, బండరాయితో తలపై మోది హత్య
కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న మధ్యాహ్నం జరిగిన పరువు హత్య కలకలం రేపుతోంది. విధులు ముగించుకుని న్యూ ఇయర్ వేడుకల కోసం కేక్ తీసుకుని ఇంటికి వెళ్తున్న యువకుడిని దారిలో అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నందవరం మండలం గురజాలకు చెందిన ఆడమ్‌స్మిత్ (35) ఫిజియోథెరపిస్ట్. అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

వీరి ప్రేమ విషయం తెలియని మహేశ్వరి తల్లిదండ్రులు గతేడాది ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. నవంబరు 12న నంద్యాలలో బ్యాంకు కోచింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పిన మహేశ్వరి.. ప్రియుడు ఆడమ్‌స్మిత్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్న అనంతరం కొన్ని రోజులు అక్కడే స్నేహితుల వద్ద ఉన్నారు. విషయం తెలిసిన మహేశ్వరి కుటుంబ సభ్యులు స్మిత్‌కు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు.

భయపడిన స్మిత్, మహేశ్వరి కలిసి గత నెల 1న కర్నూలు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఫక్కీరప్పను కలిసి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. దీంతో ఆయన ఇరు కుటుంబాలను పిలిచి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ససేమిరా అన్న మహేశ్వరి తల్లిదండ్రులు కుమార్తెను ఊళ్లోకి రావొద్దని, ఇద్దరూ కలిసి వస్తే తమ పరువు పోతుందని హెచ్చరించారు. తాము రాబోమని చెప్పడంతో వారు వెనక్కి తగ్గారు.

అనంతరం మహేశ్వరి దంపతులు ఆదోనికి వచ్చి ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం స్మిత్ విధులు ముగించుకుని నూతన సంవత్సర వేడుకల కోసం కేక్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించారు. బైక్‌పై వెళ్తున్న అతడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో స్మిత్ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

అప్పటికే వారు బండరాయితో స్మిత్ తలపై మోది పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన స్మిత్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తన  భర్తను తన తండ్రి చిన ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలే హత్య చేశారని మహేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సహా పలు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kurnool District
Nandyal
honour killing
Andhra Pradesh

More Telugu News