Pakistan: యూపీలో గ్రామ సర్పంచ్​ గా పాకిస్థానీ మహిళ.. కంగుతిన్న అధికారులు!

  • గ్రామస్థుడి ఫిర్యాదుతో వెలుగులోకి
  • 35 ఏళ్ల క్రితం బంధువు ఇంటికి
  • అక్కడే ఓ వ్యక్తితో నిఖా.. దీర్ఘకాలిక వీసాపై నివాసం
  • 2015 స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ గా పోటీ
  • పౌరసత్వం లేకుండానే ఆధార్, ఓటర్ ఐడీలూ
Shock after Pakistani woman becomes village head in UP

ఐదేళ్ల పాటు గ్రామ వార్డు సభ్యురాలిగా పనిచేసింది.. ఏడాది క్రితమే తాత్కాలిక సర్పంచ్ గా బాధ్యతలు తీసుకుంది.. ఆ పదవిలో ఉండే సరికి అంతా ఊరిపెద్దే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆమె 65 ఏళ్ల ఓ పాకిస్థానీ అని తెలిసి కంగుతిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఈటా జిల్లా గ్వాదౌ గ్రామంలో జరిగింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు పౌరసత్వమే లేని ఆమెకు ఆధార్, ఓటర్ ఐడీ ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన బానో బేగమ్.. 35 ఏళ్ల క్రితం ఈటాలోని తన బంధువు ఇంటికి వచ్చింది. అక్కడే అక్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈటాలోనే దీర్ఘకాలిక వీసాపై ఆమె నివాసం ఉంటోంది. పలుమార్లు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసినా రాలేదు.

ఈ క్రమంలోనే 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. వార్డు మెంబర్ గా గెలిచింది. ఈ ఏడాది జనవరి 9న గ్రామ సర్పంచ్ షెహ్నాజ్ బేగం చనిపోవడంతో.. గ్రామ కమిటీ సిఫార్సుల మేరకు బానో బేగమ్ తాత్కాలిక సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది. అయితే, ఆమె పాకిస్థాన్ కు చెందిన మహిళ అని అదే గ్రామానికి చెందిన ఖ్వావైదాన్ ఖాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది.

ఆమె సర్పంచ్ పదవికి రాజీనామా చేసినా.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈటా జిల్లా పంచాయతీ రాజ్ అధికారి అలోక్ ప్రియదర్శి కలెక్టర్ శుఖ్లాల్ భారతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కేసు పెట్టి దర్యాప్తు చేయాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఆమెను సర్పంచ్ గా చేసిన గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్టు ప్రియదర్శి చెప్పారు. ఆధార్, ఓటర్ కార్డులు ఆమెకు ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్టు కలెక్టర్ భారతి చెప్పారు. ఆమెకు సాయం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News