ఆసుపత్రిలో ఉన్న తనను సల్మాన్ ఎలా చూసుకున్నాడో వెల్లడించిన రెమో!

31-12-2020 Thu 14:01
  • సల్మాన్ ఖాన్ దయార్ద్ర హృదయం కలవాడు
  • మేము ఆయనను ఏంజెల్ అని పిలుచుకుంటాము
  • నేను ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఎంతో కేర్ తీసుకున్నాడు
Remo DSouza Reveals How Salman Khan Helped Him When He Was Hospitalised
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దయార్ద్ర హృదయుడంటూ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా కొనియాడాడు. ఈ నెల ప్రారంభంలో రెమో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

తనను ప్రేమతో హత్తుకున్న ఫొటోను ఆయన భార్య లిజెల్లే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇదే సమయంలో సల్మాన్ కు కృతజ్ఞతలు తెలిపింది. 'తమకు ఎంతో అండగా నిలిచిన సల్మాన్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నీవు దేవుడివి. నీవు ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ' అని తెలిపారు.

మరోవైపు, ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెమో డిసౌజా కూడా సల్మాన్ పట్ల తనకున్న విధేయతను చాటుకున్నారు. 'సల్మాన్ హృదయం బంగారం. అందుకే మేము ఆయనను ఏంజెల్ అంటాము. ఆయనతో కలసి నేను పని చేశాను. ఆయన ఒక ఆణిముత్యం అని నాకు తెలుసు. నేను, సల్మాన్ ఎక్కువగా మాట్లాడుకోము. ఎస్ సర్, ఓకే సర్... ఇంతవరకే మా మాటలు ఉంటాయి. నా భార్య, సల్మాన్ చాలా క్లోజ్. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కు నన్ను తరలించిన వెంటనే... సల్మాన్ కు నా భార్య లిజెల్లే ఫోన్ చేసింది. నేను ఆసుపత్రిలో ఉన్న ఆరు రోజులు కూడా సల్మాన్ నా గురించి ఎంతో కేర్ తీసుకున్నారు. డాక్టర్లతో కూడా ఆయన పర్సనల్ గా మాట్లాడారు' అని రెమో చెప్పారు.