Andhra Pradesh: ఆ లేఖతో లబ్ధి పొందడంలో జగన్ విజయవంతమయ్యారు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

  • అంతిమంగా జగన్ లబ్ధి పొందుతారో, లేదో తెలియదు
  • ఆ లేఖ వల్లే బదిలీలు జరిగాయని ప్రజలు అనుకోవచ్చు
  • తెలంగాణ హైకోర్టు సీజే బదిలీతో సీబీఐ కేసులో జాప్యం
YS Jagan benefited with that letter says AP High Court Justice Rakesh Kumar

సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీజేఐకి లేఖ రాయడంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ కుమార్ వైదొలగాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని కొట్టేసిన న్యాయస్థానం ఆ సందర్భంగా వెలువరించిన తీర్పులో జగన్ లేఖను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వల్ల ప్రస్తుతానికైతే జగన్ లబ్ధిపొందారని అయితే, అంతిమంగా ఊరట లభిస్తుందో, లేదో తెలియదని అన్నారు. కాకపోతే, ఈ లేఖ వల్లే ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయని ప్రజలు భావించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీ కారణంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్‌పై కేసుల విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని జస్టిస్ రాకేశ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్ల జగన్‌కు అయాచిత లబ్ధి చేకూరవచ్చన్నారు. అమరావతి నిర్మాణానికి పేద రైతులు భూములిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక దానిని నిలిపివేశారని అన్నారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌బెంచ్ నెల రోజులకుపైగా తుది విచారణ జరిపిందని, ఇప్పుడాయన బదిలీతో విచారణ నిలిచిపోయిందన్నారు. కొత్త బెంచ్ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని, కాబట్టి విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి రావొచ్చని జస్టిస్ రాకేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

More Telugu News