Police: మహిళలూ 'ఖాకీ' డ్రెస్ వేస్తున్నారు.. దేశవ్యాప్తంగా 16% పెరిగిన సిబ్బంది

  • నిరుడు 1.85 లక్షలు.. ఇప్పుడు 2.15 లక్షలు
  • అయినా మొత్తం బలగాల్లో 10.3 శాతమే
  • అత్యధికంగా బీహార్లో 25.3 శాతం మహిళా పోలీసులు 
  • 5.11 శాతంతో కింది నుంచి రెండో స్థానంలో తెలంగాణ
  • బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక
Number of women cops in states and UTs up 16 percent in a year

ఒకప్పుడు మహిళలు గడప దాటాలంటే కట్టుబాట్లు అడ్డు వచ్చేవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. తరాలు మారాయి. మహిళలూ పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. చదువుల్లోనూ.. ఆటల్లోనూ.. ఉద్యోగాల్లోనూ.. ఏ రంగమైనా దూసుకుపోతున్నారు. అత్యంత కష్టం అనుకునే పోలీసు ఉద్యోగంలోనూ తమ సత్తా చాటుతున్నారు.

పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మహిళల వాటా 16 శాతం పెరిగింది. అయితే, వృద్ధి 16 శాతం కనిపిస్తున్నా.. మొత్తంగా చూస్తే మాత్రం మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. గత ఏడాది జనవరి 1 నాటికి మహిళా పోలీసులు 8.9 శాతం మంది ఉండగా.. ఈ ఏడాది జనవరి 1 నాటికి 10.3 శాతం మందికి పెరిగింది. ఆ లెక్కలకు సంబంధించి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్&డీ) మంగళవారం నివేదిక విడుదల చేసింది.

నిరుడు లక్షా 85 వేల మంది మహిళా పోలీసులుండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 2 లక్షల 15 వేలకు పెరిగింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు సిబ్బందిలో 10.3 శాతం మంది మహిళా పోలీసులుండగా.. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) మాత్రం కేవలం 2.9 శాతమే ఉన్నారు. మొత్తం 9.9 లక్షల మంది సిబ్బంది ఉన్న సీఏపీఎఫ్ లో మహిళల వాటా కేవలం 29,249. అందులో సీఐఎస్ఎఫ్ లో 8,631, సీఆర్పీఎఫ్ లో 7,860, బీఎస్ఎఫ్ లో 5,130 మంది మహిళా సిబ్బంది ఉన్నారు.

వెనకబడిన రాష్ట్రంగా పిలిచే బీహార్లోనే మహిళా పోలీసులు ఎక్కువగా ఉన్నారు. సివిల్ పోలీస్, జిల్లా సాయుధ రిజర్వ్, ప్రత్యేక సాయుధ బలగాలు, ఇండియా రిజర్వ్ బెటాలియన్స్ అన్నింట్లో కలిపి దాదాపు 25.3 శాతం మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో 19.15 శాతం మంది ఉన్నారు. చండీగఢ్ లో 18.78 శాతం, తమిళనాడులో 18.5 శాతం మంది మహిళా పోలీసులున్నారు. అయితే, మొత్తంగా దేశవ్యాప్తంగా మహిళలకు కేటాయించిన 20 శాతం పోలీసు పోస్టులు మాత్రం ఖాళీగానే ఉండిపోయాయి.

2014 నుంచి మహిళా పోలీసుల సంఖ్య నిలకడగా పెరుగుతోంది. ఆ ఏడాది కేవలం లక్షా 11 వేల మందే మహిళా పోలీసులున్నారు. అయితే, ఇప్పుడు వారికి రిజర్వేషన్లు కేటాయిస్తుండడంతో మహిళల వాటా పెరుగుతూ వస్తోంది. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20 శాతం, మూడు రాష్ట్రాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేంద్ర బలగాల్లోనూ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. జమ్మూకశ్మీర్లో అతి తక్కువగా 3.31 శాతం మంది మాత్రమే ఆ శాఖలో పనిచేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణలో కేవలం 5.11 శాతం మంది ఉన్నారు.    

ప్రతి లక్ష మంది జనానికి ఉండాల్సిన పోలీసు కేటాయింపుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. గతేడాది ఆ సంఖ్య 158.2గా ఉండేది. ఇప్పుడది 155.7కు పడిపోయింది. అయితే, ప్రస్తుతం ఉన్న పోలీసుల సంఖ్య కూడా తగ్గింది. పోయినేడాది జనవరి 1 నాటికి ప్రతి లక్ష మంది జనాభాకు 198.4 మంది పోలీసులుండగా.. ఇప్పుడు అది 195.4కు తగ్గింది.

కాగా, నాగాలాండ్లో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 1,301 మంది పోలీసులున్నారు. అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువగా బీహార్ లో ప్రతి లక్ష మందికి కేవలం 76.2 మంది పోలీసు సిబ్బందే ఉన్నారు. ఆ తర్వాత డామన్ అండ్ డయ్యూ, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో అతి తక్కువగా ఉన్నారు.

ఇక, ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు ఉండాల్సిన పోలీసుల సంఖ్యలో కొంచెం వృద్ధి నమోదైంది. ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు గతేడాది 78.9 మంది మంది పోలీసులుండగా.. ఈ ఏడాది అది 79.8కి పెరిగింది. మొత్తంగా దేశంలో 20.9 లక్షల మంది పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. అయితే, శాంక్షన్ అయిన 26.23 లక్షల పోస్టుల కన్నా తక్కువ మందే ఉన్నారు.  

More Telugu News