భారత జట్టుపై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదమ్మా!: ఆసీస్ మాజీ క్రికెటర్లకు గవాస్కర్ కౌంటర్

30-12-2020 Wed 12:00
  • టెస్టు సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారు
  • ఇది భారత్.. ఎవరికీ తలవంచదు
  • రహానెను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసించారు
  • తొలి టెస్టులోనూ రెండు రోజులు టీమిండియా బాగానే ఆడింది
gavaskar praises indian team

ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన భారత్ రెండో టెస్టులో విజయం సాధించడం గమనార్హం. దీనిపై మాజీ  క్రికెటర్‌ సునీల్ గవాస్కర్‌ స్పందిస్తూ... దీనితో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగిందని, గతంలో ఆసీస్ తొలి టెస్టు గెలిచిన ప్రతిసారి సిరీస్‌లోనూ విజయం సాధించిందని చెప్పారు.

మొదటి టెస్టులో గెలిస్తే ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించేవారని తెలిపారు. అయితే, ఇటీవల భారత్‌తో జరిగిన తొలి టెస్టులో గెలవడంతో ఆసీస్ లోని కొంత మంది మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారని తెలిపారు.

ఈ సిరీస్‌లో తమ జట్టు చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోతుందని అన్నారని తెలిపారు. కానీ, ఇది భారత్ అని, ఎవరికీ తలవంచదని చెప్పారు. భారత జట్టుపై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదని తెలిపారు. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రహానెను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.  

తొలి టెస్టులోనూ తొలి రెండు రోజులు టీమిండియా బాగానే ఆడిందని, మూడో రోజు ఆటలో తడబాటుతో ఓటమిపాలైందని చెప్పారు. టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్  షాట్ల ఎంపిక, డిఫెన్స్‌ను చూస్తుంటే భారత్‌కు అతడు దీర్ఘకాలం సేవలు అందిస్తాడని అనిపిస్తోందని చెప్పారు.