Corona new strain: చెన్నై వ్యక్తికి సోకిన కరోనా కొత్త వైరస్.. నిర్ధారించిన పూణె ల్యాబ్

Chennai man infected to corona new strain
  • నవంబరు 25 నుంచి ఇప్పటి వరకు 2,200 మందికి పరీక్షలు
  • లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది నమూనాలు పూణె ల్యాబ్‌కు
  • బాధితుడిని కరోనా ప్రత్యేక ఆసుపత్రికి తరలించి చికిత్స
దేశంలో నెమ్మదిగా కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వేళ్లూనుకుంటోంది. బ్రిటన్ నుంచి దేశానికి వస్తున్న వారిలో ఇది బయటపడుతోంది. లండన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 30 మంది నమూనాలను సేకరించి పూణె వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జె రాధాకృష్ణన్ తెలిపారు.

నవంబరు 25 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన 2,200 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 17 మందిలో వైరస్ లక్షణాలు బయటపడినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, వారితో సంబంధాలు కలిగిన మరో 16 మందికి కూడా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.

పాజిటివ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా, చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. బాధితుడిని ప్రస్తుతం గిండీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
Corona new strain
Chennai
Tamil Nadu

More Telugu News