Corona Virus: టీకానూ వదలని కేటుగాళ్లు... రూ.500 కడితే మొదటే వేయిస్తామంటూ భోపాల్ లో ప్రచారం!

  • సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదులు
  • ఆధార్, బ్యాంకు వివరాలు అడుగుతున్న మోసగాళ్లు
  • నమ్మవద్దని ప్రజలను కోరిన అధికారులు
Scam in Bhopal on Corona Vaccine

కేవలం రూ. 500 కడితే, అందరికన్నా ముందుగానే కరోనా టీకాను పొందవచ్చని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా జరుగుతున్న ఓ ప్రచారంపై సైబర్ సెల్ పోలీసులు స్పందించారు, ఇటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. గత కొంతకాలంగా తమకు స్కామ్ కాల్స్ వస్తున్నాయని, రూ. 500 కట్టి రిజిస్టర్ చేసుకుంటే, తొలి విడతలోనే టీకాను అందిస్తామని చెబుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.

నగర పరిధిలోని సహ్యాద్రి పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న మోనికా దూబేతో పాటు మరో విద్యార్థి కూడా ఈ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో, వీరి బారిన ఎంతమంది పడ్డారన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. పలువురికి ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు, డబ్బు కట్టడంతో పాటు ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చెబితే, కేంద్రం నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ ను వేయిస్తామని నమ్మబలుకుతున్నారు.

మోసగాళ్లు తమకు కనిపించిన ప్రతి మార్గంలోనూ ప్రజలను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన సైబర్ సెల్ ఎస్పీ గురుకరణ్ సింగ్, ప్రజలు ఎవరూ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను తెలియజేయరాదని అన్నారు. కరోనా టీకాను తొలుత ఎవరికి ఇవ్వాలన్న విషయమై ఇప్పటికే మార్గనిర్దేశకాలు జారీ అయ్యాయని, వారి పేర్లను కూడా సేకరించి వుంచామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

More Telugu News