Kamala Harris: కరోనా టీకాను తీసుకున్న కమలా హారిస్.. టీవీలలో ప్రత్యక్ష ప్రసారం!

  • మంగళవారం టీకా తీసుకున్న హారిస్ దంపతులు
  • యునైటెడ్ మెడికల్ సెంటర్ లో హారిస్ కు వ్యాక్సిన్
  • ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకేనని వెల్లడి
Kamala Harris Take Vaccine Shot Live

అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోగా, ఈ కార్యక్రమాన్ని పలు టెలివిజన్ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. టీకాపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా కమలా హారిస్ వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్ లోని యునైటెడ్ మెడికల్ సెంటర్ కు మాస్క్ ధరించి వచ్చిన ఆమె, టీకా తొలి డోస్ ను తీసుకున్నారు. వాషింగ్టన్ ప్రాంతంలో ఆఫ్రికన్ - అమెరికన్ ప్రజలు అధికంగా ఉంటారు. కరోనా కేసుల విషయంలోనూ, మరణాల్లోనూ ఈ ప్రాంతం హై రిస్క్ లో ఉండగా, వారందరినీ టీకా తీసుకునేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.

"నేను ఒకటే చెప్పాలని భావిస్తున్నాను. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది సురక్షితమే" అని మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హారిస్ తో పాటు ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్ కూడా టీకాను తీసుకున్నారు. కాగా, అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవుతున్న తొలి నల్లజాతి, ఇండియన్ - అమెరికన్ మహిళగా కమలా హారిస్ జనవరి 20న చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాదు, అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ కూడా ఆమే.

More Telugu News