KCR: జీతాల పెంపు, పదోన్నతులు: ఉద్యోగులపై వరాలు కురిపించిన కేసీఆర్

  • జనవరి, ఫిబ్రవరి కల్లా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవ్వాలి
  • మార్చికల్లా అన్ని సమస్యల నుంచి ఉద్యోగులకు విముక్తి లభించాలి
  • ఉద్యోగులకు మరోసారి జీతాలు పెంచేందుకు సమయం ఆసన్నమైంది
Including Salary hike KCR announces new year gifts to employees

అన్ని రకాల ప్రభుత్వోద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. కొత్త సంవత్సర కానుకగా ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని, కోరుకున్న వారికి బదిలీలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజునే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలను అందించి ఘనంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలను చేపట్టడం వంటి అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా పరిష్కరిస్తామని తెలిపారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి, ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో వేతనాలను పెంచామని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మరోసారి వేతనాలను పెంచాల్సిన సమయం వచ్చిందని... ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర అన్ని రకాల ఉద్యోగులకు ఎంతో  కొంత జీతాలను పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని... ఆ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పదవీ విరమణ వయసును ఎంత వరకు పెంచాలనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.

ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను జనవరి, ఫిబ్రవరి కల్లా పరిష్కరించాలని.... మార్చి నుంచి ఉద్యోగులందరూ అన్ని సమస్యల నుంచి విముక్తి కావాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏపీతో నెలకొన్న వివాదాల వల్ల రెవెన్యూ, పోలీసు శాఖల్లో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాలేదని... ఇప్పుడు ఆ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని, కాబట్టి వారికి కూడా పదోన్నతులు ఇవ్వాలని అన్నారు.

More Telugu News