Melbourne: మెల్బోర్న్ టెస్టు నేపథ్యంలో కొన్ని ఆసక్తికర గణాంకాలు ఇవిగో!

  • మెల్బోర్న్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ముగిసిన రెండో టెస్టు
  • 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
  • రహానేకు ముల్లా మెడల్ ప్రదానం
  • రెండు ఇన్నింగ్స్ లలో ఐదు వికెట్లు తీసిన సిరాజ్
Interesting statistics after Melbourne test

ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టుకైనా ఆస్ట్రేలియా పర్యటన అత్యంత కఠినమైనది. ఇక్కడి ఫాస్ట్ పిచ్ లకు అలవాటు పడడం ఏమంత సులభం కాదు. పైగా కంగారూ ఆటగాళ్లు తమ సంస్కృతిలో భాగమైన దూకుడును మైదానంలో కూడా ప్రదర్శిస్తుంటారు. ఫలితంగా మంచి ఆటగాళ్లు కూడా ఏకాగ్రత కోల్పోయి వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు అనేకం. గతంలో మంకీగేట్ వివాదంగా పేరొందిన హర్భజన్-సైమండ్స్ వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా తాజా టెస్టు సిరీస్ లో ఎంతో పట్టుదలతో పుంజుకున్న వైనం అద్భుతం. పింక్ బాల్ తో అడిలైడ్ లో జరిగిన టెస్టును భారత్ అత్యంత అవమానకర రీతిలో కేవలం రెండున్నర రోజుల్లో ఓడింది. ఈ విజయంతో గొప్ప కిక్కు అందుకున్న ఆసీస్ రెండో టెస్టులో చెలరేగిపోతారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. భారత్ పోరాటపటిమతో మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక అసలు విషయానికొస్తే.... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఇవాళ ముగిసిన రెండో టెస్టు ద్వారా అనేక ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం...

  • ఎంసీజీలో ఇవాళ 8 వికెట్లతో సాధించిన విజయం విదేశీ గడ్డపై మనవాళ్లకు 52వ విక్టరీ.
  • ఎంసీజీలో టీమిండియా 4 టెస్టుల్లో నెగ్గింది. ఒక్క ఇంగ్లాండ్ తప్ప ఇక్కడ మూడుకు పైగా విజయాలను మరే జట్టు సాధించలేదు. 
  • గడచిన 50 ఏళ్లలో ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో ఓడిన తర్వాత పుంజుకుని రెండో టెస్టు గెలిచిన జట్లలో భారత్ మూడో జట్టుగా అవతరించింది. గతంలో వెస్టిండీస్, న్యూజిలాండ్ ఇలాగే తొలి టెస్టు ఓడిపోయినా, రెండో టెస్టులో గెలిచి సమం చేశాయి. ఇప్పుడు భారత్ కూడా  0-1తో మెల్బోర్న్ వచ్చి 1-1తో సిరీస్ లో సమవుజ్జీగా నిలిచింది. 
  • 2000 నుంచి పరిశీలిస్తే ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై సాధించిన టెస్టు విజయాలతో పోల్చితే, టీమిండియా.... ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన విజయాలే ఎక్కువ. 2000 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాలో 22 టెస్టులు ఆడి 5 విజయాలు సాధించింది. కానీ ఆసీస్ జట్టు భారత్ లో 21 టెస్టులు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య తేడా ఒక్క టెస్టు విజయమే అయినా భారత్ దే పైచేయిగా నిలిచింది.
  • ఆసీస్ గడ్డపై జరిగిన ఓ టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య ఆటగాళ్లు కనీసం ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించకపోవడం 32 ఏళ్లలో ఇదే తొలిసారి.
  • ముల్లాగ్ మెడల్ ను గెలుచుకున్న తొలి ఆటగాడిగా టీమిండియా తాత్కాలిక సారథి అజింక్యా రహానే ఘనత వహించాడు. ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ఆదివాసీ జాతికి చెందిన ఆల్ రౌండర్ జానీ ముల్లాగ్ స్మారకార్థం 2020 బాక్సింగ్ డే టెస్టు నుంచి ఆయన పేరిట మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రదానం చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. మెల్బోర్న్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో శతకం సాధించి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన రహానేకు ఈ మెడల్ ప్రదానం చేశారు. 
  • కెరీర్ లో తొలి టెస్టు ఆడుతూ ఆసీస్ గడ్డపై మొదటి మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మహ్మద్ సిరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. మెల్బోర్న్ టెస్టులో సిరాజ్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 5 వికెట్లు తీశాడు. సిరాజ్ కంటే ముందు 2004లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ 6 వికెట్లు సాధించాడు.

More Telugu News