Australia: మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై స్లో ఓవర్ రేట్ జరిమానా

  • మెల్బోర్న్ టెస్టులో భారత్ చేతిలో ఆసీస్ ఓటమి
  • నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువ వేసిన ఆసీస్
  • ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
  • 4 టెస్టు చాంపియన్ షిప్ పాయింట్లు ఉపసంహరణ
ICC fined Australia for slow overrate in Melbourne test

అసలే పరాజయ భారంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ విధించాడు. మెల్బోర్న్ టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన ఆసీస్ ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్టు రిఫరీ గుర్తించాడు. నిర్దేశించిన సమయానికి కంగారూలు రెండు ఓవర్లు తక్కువగా వేశారు. ఇది తమ నియమావళిలోని 2.22 అధికరణ ప్రకారం జరిమానా విధించదగ్గ తప్పిదమని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం ఆస్ట్రేలియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు.

అంతేకాదు, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ నిబంధనలకు సంబంధించిన 16.11.2 అధికరణ ప్రకారం... నిర్దేశిత సమయం కంటే తక్కువగా విసిరే ఒక్కో ఓవర్ కు రెండు పాయింట్ల చొప్పున ఆసీస్ ఖాతా నుంచి 4 చాంపియన్ షిప్ పాయింట్లను ఉపసంహరిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అంగీకరించడంతో దీనిపై తదుపరి విచారణ ఉండబోదని క్రికెట్ మండలి వివరించింది.

More Telugu News