Chandrababu: కడప జిల్లా టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యపై చంద్రబాబు స్పందన

Chandrababu condemns Nandam Subbaiah murder
  • ప్రొద్దుటూరులో హత్య
  • కళ్లల్లో కారం చల్లి హత్యకు పాల్పడిన దుండగులు
  • హత్యను ఖండిస్తున్నట్టు తెలిపిన చంద్రబాబు
  • ఎవరికీ భద్రత లేకుండా పోయిందని వ్యాఖ్యలు
  • వైసీపీ నేతల పాత్రపై ఆరా తీయాలంటూ డిమాండ్
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కళ్లల్లో కారం చల్లిన దుండగులు, ఆపై మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దాడిలో సుబ్బయ్య తల భాగం ఛిద్రమైపోయింది. ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.

కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యను ఖండిస్తున్నానని తెలిపారు. తాడిపత్రి ఘటన నేపథ్యంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని సీఎంకు, డీజీపీకి లేఖ రాసిన 24 గంటల్లోపే చేనేత కుటుంబానికి నేత సుబ్బయ్యను కిరాతకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది చేస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడినందుకు సుబ్బయ్యను హత్య చేస్తారా? అని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుబెట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు, మానభంగాలు, హింస, విధ్వంసాలతో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని రౌడీలు, హంతకుల చేతుల్లో పెట్టి పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే ఈ హత్యలో వైసీపీ నేతల పాత్రపై ఆరా తీసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
Nandam Subbaiah
Murder
Telugudesam
Proddutur
YSRCP
Kadapa District
Andhra Pradesh

More Telugu News