అందరి నోట... అజింక్యా రహానే!

29-12-2020 Tue 15:07
  • మెల్బోర్న్ టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం
  • రహానే నాయకత్వంపై ప్రశంసల వర్షం
  • రహానే కెప్టెన్సీ అద్భుతం అంటూ మాజీల అభినందనలు
  • జట్టు విజయానికి సమష్టి కృషే కారణమన్న రహానే
Former cricketers lauds Ajinkya Rahane for Melbourne win

అసలే ఆస్ట్రేలియాతో సిరీస్.. తొలి టెస్టులో ఓడింది... జట్టులో కోహ్లీ లేడు, షమీ లేడు.... రెండో టెస్టులో టీమిండియా ఎలా ఆడుతుందో ఏమో అనుకున్న వేళ... అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మెల్ బోర్న్ లో జయకేతనం ఎగురవేసింది. తద్వారా నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసి రేసులో నిలిచింది. అందుకు కారణం అజింక్యా రహానే ఆట, నాయకత్వ సామర్థ్యం అని ముక్తకంఠంతో అంటున్నారు.

చూడ్డానికి బక్క పలుచగా కనిపించే రహానేలో పట్టుదల ఎంత మెండుగా ఉంటుందో తొలి ఇన్నింగ్స్ లో అతను సాధించిన అద్భుతమైన సెంచరీయే చెబుతుంది. మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఈ ముంబై వాలాలో క్రికెటింగ్ తెలివి ఏ స్థాయిలో ఉంటుందో మెల్బోర్న్ లో అతడు చేసిన బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మోహరింపులే చెబుతాయి. కెప్టెన్సీ తనకు అదనపు భారం కాదని, పైగా ఎంతో బాధ్యత అని భావించి జట్టును ముందుండి నడిపించిన రహానేపై ఇప్పుడు ప్రశంసల జడివాన కురుస్తోంది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మెల్బోర్న్ లో చిరస్మరణీయ విజయానికి కారకుడు రహానే అని కీర్తించాడు. రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయం అని తన మనోభావాలను వెల్లడించాడు. క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ, జట్టుకు రహానే నాయకత్వం వహించిన తీరు ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నాడు. తెలివైన కెప్టెన్సీ అని అభినందించాడు. ఓ నాయకుడిలా రహానే ముందుండి నడిపించాడని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇదిలావుంటే, మ్యాచ్ ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ, ఈ విజయానికి కారణం సమష్టి కృషి అని చెప్పడం ద్వారా తన వినమ్రతను చాటుకున్నాడు. కొత్తకుర్రాడు శుభ్ మాన్ గిల్ సమయోచితంగా రాణించడం, ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేయడం వంటి పలు కారణాలు తమకు గెలుపును అందించాయని చెప్పాడు.

కాగా, భారత టెస్టు జట్టుకు ఎప్పట్నించో వైస్ కెప్టెన్ గా ఉన్న రహానే తనకు కెప్టెన్ గా అవకాశం లభించిన ప్రతిసారి జట్టుకు విజయాన్ని అందించడం విశేషం అని చెప్పాలి. ఇప్పటివరకు రహానే 3 టెస్టుల్లో సారథ్యం వహించగా మూడింటా భారత్ విజయదుందుభి మోగించింది.