ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియాకు వెంకటేశ్ శుభాకాంక్షలు

29-12-2020 Tue 13:20
  • రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా
  • ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్
  • అద్భుతమైన విజయమన్న వెంకటేశ్
Actor Venkatesh greets Team India

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ని 1-1తో టీమిండియా సమం చేసింది. మరోవైపు ఈ విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సచిన్, కోహ్లీ, లక్ష్మణ్, సెహ్వాగ్, రోహిత్ శర్మ తదితరులు తమ శుభాకాంక్షలను తెలియజేశారు.

మరోవైపు, క్రికెట్ ను ఎంతగానో అభిమానించే ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ కూడా భారత జట్టు విజయంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, అద్భుతమైన విజయమని కొనియాడారు. కంగ్రాట్స్ టీమిండియా అని అన్నారు. మొత్తం జట్టు సమష్టి కృషితో అద్భుత విజయాన్ని సాధించిందని ప్రశంసించారు.