Velagapudi: రణరంగాన్ని తలపించిన వెలగపూడి.. మరియమ్మ మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు

  • వెలగపూడిలో రోజంతా ఉద్రిక్తత
  • బైఠాయింపులు, ఆందోళనలు, నినాదాలతో హోరెత్తిన గ్రామం
  • అర్ధరాత్రి ఇరు వర్గాలతో హోం మంత్రి సుచరిత చర్చలు
  • ఎంపీ నందిగం పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చుతామని హామీ
last rites held for mariamma at late night in velagapudi

ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన మరియమ్మ (50) మృతదేహానికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరియమ్మ మృతితో నిన్న వెలగపూడిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో గ్రామం అట్టుడికిపోయింది.

 ఈ ఘర్షణల వెనక ఎంపీ నందిగం సురేశ్ హస్తం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన హోంమంత్రి సుచరిత అర్ధరాత్రి వేళ ఎస్సీ సంఘాలతో చర్చలు జరిపారు. నందిగం పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభంలో నిర్మించతలపెట్టిన స్వాగత తోరణానికి పేరు పెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య పొడసూపిన భేదాభిప్రాయాలు ఈ ఘటనకు కారణమయ్యాయి. బాబూ జగ్జీవన్‌రామ్ పేరు పెట్టాలని ఓ వర్గం సూచించగా, మరో వర్గం దానిని తిరస్కరించింది. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ రేకెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు.

అనంతరం పేరును పైనల్ చేసేందుకు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చర్చల కోసం ఇరు వర్గాలు ఒక చోటకు చేరాయి. ఈ క్రమంలో వారి మధ్య  మరోమారు ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలవారు రాళ్లు, ఇటుకలతో దాడులకు దిగారు. అదే సమయంలో ఇంటి బయట పాత్రలు శుభ్రం చేసుకుంటున్న మరియమ్మ (50)కు రాళ్లు వచ్చి తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది.

More Telugu News