Vijayashanti: కొనుగోలు కేంద్రాలు తీసేస్తే రైతులు మీ తోళ్లూ, గోళ్లూ తీసేసే పరిస్థితులు వస్తాయి: విజయశాంతి విసుర్లు

  • సీఎంకు ఓటమి భయం పట్టుకుందని వెల్లడి
  • అందుకే ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • హామీల అమలుపై చేతులెత్తేయొచ్చని వ్యాఖ్యలు
  • తెలంగాణ సమాజం తిరుగుబాటుకు సిద్ధమైందని స్పష్టీకరణ
Vijayasanthi take a dig at Telangana CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ధ్వజమెత్తారు. ఓటమి భయంతో, కేసుల భయంతో సీఎం గారు చివరికి ప్రజలను కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు.

ఇవాళ రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని, రూ.7,500 కోట్ల నష్టం వస్తుందని అంటున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం... రేపు రూ.4 లక్షల కోట్ల అప్పుల కారణంగా పెన్షన్లు కూడా ఇవ్వలేమని, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేం అని చేతులు దులుపుకునే అవకాశం ఉందని విజయశాంతి పేర్కొన్నారు. కొంతమంది టీఆర్ఎస్ మంత్రులు ఇటీవల చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అవి నిజమే అనిపించేలా ఉన్నాయని తెలిపారు. దళితుల మూడెకరాల భూమి తుంగలో తొక్కినట్టే ఇవి కూడా జరగొచ్చని అభిప్రాయపడ్డారు.

కానీ తెలంగాణ సమాజం తిరుగుబాటుకు సిద్ధమైందని, పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని ఈ పరిపాలకులు అర్థం చేసుకోకపోతే అది వారి మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. మీరు కొనుగోలు కేంద్రాలు తీసేస్తే రైతులు మీ తోళ్లూ, గోళ్లూ తీసే పరిస్థితులు ఉంటాయేమో విశ్లేషించుకోవాలని హితవు పలికారు.

More Telugu News