Oxford: ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా... గెలిచేది మేమే: ఆస్ట్రాజెనికా చీఫ్ పాస్కల్

  • మాదే విజయవంతమైన టీకా
  • ఎంతో ప్రభావవంతంగా పని చేస్తోంది 
  • సండే టైమ్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • ప్రస్తుతం ఎంహెచ్ఆర్ఏ పరిశీలనలో నివేదిక
Winning formula on Corona is Ours says Astragenica

కరోనా మహమ్మారిని ఎదిరించేలా మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తమది విజయవంతమైన ఫార్ములా అని ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎన్ని దేశాల్లోని కంపెనీలు టీకాలను తయారు చేసినా, గెలిచే టీకా తమదేనని 'సండే టైమ్స్' న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ తో కలసి తాము తయారు చేసిన వ్యాక్సిన్ ఎంతో ప్రభావవంతంగా పని చేస్తోందని పాస్కల్ తెలిపారు.

ప్రస్తుతం బ్రిటన్ లో ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉన్న తమ వ్యాక్సిన్ నూటికి నూరు శాతం కరోనా నుంచి రక్షణ ఇస్తుందని, ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా చేస్తుందని ఆయన తెలిపారు. ఈ టీకా ట్రయల్స్ ను తాను స్వయంగా పరిశీలించానని, ఫైజర్, బయోటెక్, మోడెర్నాలు తయారు చేసిన టీకాలతో సమానంగా, అంతకన్నా ఎక్కువగానే శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ను అంతం చేస్తుందని తెలిపారు.

ఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం, మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. "మేము విజయవంతమైన ఫార్ములాను తయారుచేశామని భావిస్తున్నాం. రెండు డోస్ ల మా వ్యాక్సిన్ తీసుకుంటే చాలు. మా గణాంకాలు, సమాచారాన్ని అతి త్వరలో మీ ముందు ఉంచుతాము" అని పాస్కల్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ఈ నెల 23న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ నివేదికలు తమకు అందాయని యూకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా బ్రిటన్ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) వద్ద ఈ నివేదిక ఉంది. ఈ వ్యాక్సిన్ కు నేడే అనుమతి లభించవచ్చని 'సండే టెలిగ్రాఫ్' పేర్కొంది.

More Telugu News