Punjab: ఆందోళన చేస్తున్న రైతుల కన్నెర్ర.. 1338 రిలయన్స్ జియో సిగ్నల్ టవర్ల ధ్వంసం!

Punjab Farmers Vandalize Reliance towers
  • ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తిని పట్టించుకోని రైతులు
  • గత 24 గంటల్లో 151 సెల్ టవర్ల ధ్వంసం
  • రైతుల ముసుగులో అరాచకవాదులు చేస్తున్న పనేనంటున్న పోలీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ చట్టాల వల్ల పంట ఉత్పత్తుల సేకరణ, పంపిణీ తదితర వాటితో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూపులకు లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో ఉద్యమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు రిలయన్స్ జియోకు చెందిన టవర్లను ధ్వంసం చేస్తున్నారు.  గత 24 గంటల్లో 151 టవర్లను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ధ్వంసమైన మొత్తం టవర్ల సంఖ్య 1,338కి పెరిగింది.

విధ్వంసాలకు దిగవద్దని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, కార్పొరేట్లను లక్ష్యంగా చేసుకోవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మొత్తుకుంటున్నప్పటికీ ఆందోళనకారులు పెడచెవిన పెడుతున్నారు. టెలికం లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే, ఈ విధ్వంసానికి పాల్పడుతున్న వారంతా రైతులు కాకపోయి ఉండొచ్చని, కొందరు అరాచకవాదులు ఈ పనికి పాల్పడుతుండవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే, వారిని రైతులే ప్రోత్సహిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.

టవర్ల ధ్వంసంపై రిలయన్స్ స్పందించింది. కనెక్టివిటీ తెగిపోవడం వల్ల దాదాపు రూ. 40 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపింది. టవర్లకు భద్రత కల్పించాలని పంజాబ్ డీజీపీకి లేఖ రాసింది. కాగా, ఇది రైతుల పనికాదని, ఆ ముసుగులో కొందరు అరాచకవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు  పంజాబ్‌లో అతి పెద్ద రైతు సంఘమైన భారతీయ కిసాన్‌ యూనియన్‌(ఉగ్రహాన్‌) తెలిపింది. తాము జియోను బహిష్కరించమని మాత్రమే పిలుపు నిచ్చామని, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే పనులు రైతులు చేయబోరని స్పష్టం చేసింది.
Punjab
Farm Laws
Reliance
Mobile Towers

More Telugu News