Sanjay Raut: బ్యాంకు కుంభకోణం కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

  • రేపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశం
  • గత సమన్లను పట్టించుకోని వర్ష రౌత్
  • మరో నిందితుడి భార్యతో రూ. 50 లక్షల లావాదేవీ
ED summons Sanjay Raut wife Varsha Raut

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణం కేసులో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న సమన్లు జారీ చేసింది. రేపు (29న) తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్ భార్యతో వర్ష రూ. 50 లక్షల లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్షను ఈ నెల 11న తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడీ గతంలో ఆదేశించింది. అయితే, ఆమె పట్టించుకోకపోవడంతో తాజా సమన్లు జారీ చేసింది.

సంజయ్ రౌత్ భార్యకు సమన్లు జారీ అయిన విషయం తెలిసిన వెంటనే బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పీఎంసీ బ్యాంకుతో ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపినట్టు అయితే ఆ విషయాన్ని రౌత్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబం లబ్ధిపొందిందా? గతంలో ఏమైనా దర్యాప్తు జరిగిందా? ఏవైనా నోటీసులు అందుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 10 లక్షల మంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారని, ఏదైనా సమాచారం ఉంటే ఈడీతో పంచుకోవాలని సూచించారు.

More Telugu News