Bitain: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన వాళ్లలో 276 మంది జాడ లేరు!

  • అందులో పొరుగు రాష్ట్రాల వారు 92 మంది
  • తప్పుడు చిరునామాలు ఇచ్చిన మరో 184 మంది
  • వెల్లడించిన రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
276 UK returnees in Telangana untraceable

తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులకు ఇప్పుడు ఓ కొత్త తలనొప్పి పట్టుకుంది. ప్రస్తుతం కొత్త కరోనా కలకలం నేపథ్యంలో అధికారులు బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కానీ, అందులో 276 మంది ఆచూకీ దొరకట్లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లలో శనివారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా.. ఆ కేసులు మొత్తం 21కి చేరాయి. వారికి వచ్చింది కొత్త కరోనానా కాదా అన్నది తేల్చేందుకు ఆ శాంపిళ్లను హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మైక్రోబయాలజీ (సీసీఎంబీ)కి పంపించారు.

జాడ దొరకని వాళ్లలో 92 మంది పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకకు చెందిన వారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు చెప్పారు. మరో 184 మంది తప్పుడు చిరునామాలు ఇచ్చారన్నారు. పొరుగు రాష్ట్రాల వారి వివరాలను ఆయా ప్రభుత్వాలకు పంపించామని, ఆ వివరాలు వారిని గుర్తించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త రకం వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని సూచించారు. మాస్కు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు.

కాగా, శనివారం నాటికి దేశవ్యాప్తంగా బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లలో కరోనా కేసులు 119కి పెరిగాయి. అందరి శాంపిళ్లను జన్యు క్రమాన్ని తేల్చేందుకు పరీక్షల కోసం పంపారు. సోమవారం నాటికి వారి నివేదికలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 17, గోవాలో 16,  కేరళ, ఉత్తర్ ప్రదేశ్ లలో 8 చొప్పున, ఏపీలో 6, కర్ణాటకలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

More Telugu News