Konda Surekha: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా కొండా సురేఖ.. పరిశీలిస్తున్న అధిష్ఠానం!

Konda Surekha name for telangana  women congress chief
  • సురేఖకు కలిసొస్తున్న అనుభవం, బీసీ వర్గాలతో మంచి సంబంధాలు
  • అరుణ, విజయశాంతికి దీటుగా తీర్చిదిద్దాలని యోచన
  • సీతక్కకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖను నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గంలో మంచి సంబంధాలు ఉండడంతోపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం, మాటలతో ఆకట్టుకునే నేర్పు ఉండడంతో ఈ పదవిని ఆమెకే ఇవ్వాలని అధిష్ఠానం పెద్దలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డీకే అరుణ, విజయశాంతి బీజేపీలో చేరడంతో వారికి దీటుగా కొండా సురేఖను తీసుకురావాలన్నది అధిష్ఠానం ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే, మహిళా నేతలకు కూడా పెద్ద పీట వేసినట్టు అవుతుందని భావిస్తోంది.

మరోవైపు, ములుగు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని, కీలక కమిటీల్లో ఆమె పేరు చేర్చాలన్న చర్చ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. చక్కని పోరాట పటిమ ఉన్న ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమెకు కనుక మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నది అధిష్ఠానం ఆలోచన. అయితే, ఈ పదవి కోసం సునీతారావు, కాల్వ సుజాతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
Konda Surekha
Congress
women congress
Telangana
Seethakka

More Telugu News