Vishnu Vardhan Reddy: ఆ రెండు పార్టీల వారు ప్రమాణాలు చేస్తే దేవాలయాలు మలినపడతాయి: విష్ణువర్ధన్ రెడ్డి

  • వైసీపీ, టీడీపీ నేతల ప్రమాణాలపై విష్ణువర్ధన్ ఆగ్రహం
  • చంద్రబాబు గుడులు కూల్చాడని ఆరోపణలు
  • రథాలు తగలబెడుతున్నా వైసీపీ పట్టించుకోలేదని వ్యాఖ్యలు
  • ఆ రెండు పార్టీలను గుడులలోకి రానివ్వొద్దని ప్రజలకు సూచన
  • వారు వచ్చి వెళితే పసుపు నీళ్లు చల్లాలని విజ్ఞప్తి 
Vishnu Vardhan Reddy fires on YCP and TDP

బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ, టీడీపీలపై ధ్వజమెత్తారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, గత ఐదేళ్లు దోచుకుని అలసిపోయిన టీడీపీ నేతలు ప్రతి దానికి ప్రమాణం అంటూ ఆలయాలకు వస్తున్నారని విమర్శించారు. గుడులు కూల్చేసింది చంద్రబాబు అయితే, ఆలయాల్లో రథాలు తగలబెడుతున్నా పట్టించుకోని పార్టీ వైసీపీ అని ఆరోపించారు. అలాంటి ఈ రెండు పార్టీల నేతలు గుడులకు పోయి ప్రమాణాలు చేస్తే ఎవరు నమ్ముతారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ఆలయాలపై నమ్మకం లేనివారు, హిందూ ధర్మాలపై విశ్వాసం లేనివారు, గుడుల విషయంలో రోజూ ఏదో ఒక విధంగా అవమానకరంగా వ్యవహరిస్తున్న వారు గుడులకు పోయి ప్రమాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల నేతలు ప్రమాణాలు చేసేందుకు వస్తే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అసలు వారిని గుడుల వద్దకే రానివ్వరాదని, ఒకవేళ వచ్చి ప్రమాణం చేస్తే ఆ గుడులు మలినమైపోతాయని అన్నారు. వారు వచ్చి వెళ్లిన తర్వాత పసుపు నీళ్లు చల్లి ఆలయాన్ని శుద్ధి చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రజలకు వైసీపీ, టీడీపీలపై నమ్మకం పోయిందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీలో సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలయికలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు.

More Telugu News