Jay Kishore Pradhan: 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ లో చేరిన రిటైర్డ్ ఉద్యోగి

  • డాక్టర్ వృత్తిపై మమకారం
  • ఈ ఏడాది నీట్ రాసి అర్హత సాధించిన జైకిశోర్ ప్రధాన్
  • కొన్నాళ్ల కిందట ఎస్బీఐ నుంచి పదవీవిరమణ
  • తండ్రి మరణంతో డాక్టర్ అవ్వాలని నిశ్చయం
Retired employ joins MBBS course

సుదీర్ఘకాలం ఉద్యోగ విధులు నిర్వర్తించిన వ్యక్తులు పదవీ విరమణ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఒడిశాకు చెందిన జై కిశోర్ ప్రధాన్ మాత్రం మరోలా ఆలోచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసిన ఆయన కొన్నాళ్ల కిందట రిటైర్ అయ్యారు. అయితే, 64 ఏళ్ల జై కిశోర్ ప్రధాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎంబీబీఎస్ లో చేరారు.

జాతీయస్థాయిలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో అర్హత సాధించారు. అందుకోసం పెద్ద వయసులోనూ తీవ్రంగా కష్టపడ్డారు. కానీ వైద్య వృత్తిపై ఆయన అనురక్తి ముందు వయసు ఏమంత ప్రభావం చూపలేదు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ ఫస్టియర్ లో చేరారు.

జై కిశోర్ ప్రధాన్ స్వస్థలం ఒడిశాలోని బార్ గఢ్ ప్రాంతం. బాల్యం నుంచే డాక్టర్ అవ్వాలని తపించిపోయారు. 1974లో మెడికల్ ఎంట్రన్సు రాయగా, మెరుగైన ర్యాంకు రాకపోవడంతో బీఎస్సీలో చేరి, ఆపై టెలికాం ఉద్యోగం సంపాదించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో చేరారు. జై కిశోర్ బ్యాంకు ఉద్యోగం చేస్తున్న సమయంలో తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. సంవత్సరాల తరబడి చికిత్స అందించినా ఆయన ప్రాణాలు కోల్పోయారు. తండ్రి యాతనను కళ్లారా చూసిన జై కిశోర్ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

అప్పట్లో, వైద్య విద్య ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి ఉండేది. ఇప్పుడా నిబంధన లేకపోవడంతో ఈ ఏడాది నీట్ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించారు. ప్రస్తుతం భువనేశ్వర్ లోని వీర్ సురేంద్రసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సంస్థలో ఎంబీబీఎస్ లో చేరారు.

జై కిశోర్ జీవితంలో మరో విషాదం కూడా ఉంది. వైద్య వృత్తిపై ఉన్న ప్రేమతో తన పెద్దకుమార్తెను ఎంబీబీఎస్ దిశగా ప్రోత్సహించారు. అయితే, ఆమె ఎంబీబీఎస్ చదువుతుండగా, తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. డాక్టరు వృత్తిపై ఆయనకున్న మమకారం ఎలాంటిదంటే, తన రెండో కుమార్తెను కూడా మెడిసిన్ చదివిస్తున్నారు. సాధించాలన్న పట్టుదల ఉంటే వయసు అందుకు అడ్డంకి కాబోదని జై కిశోర్ చాటుతున్నారు.

More Telugu News