Muslim Women: యూపీలో హిందూ యువకులను పెళ్లాడిన ఇద్దరు ముస్లిం యువతులు

  • లవ్ జిహాద్ ఉద్రిక్తతల నడుమ ఆసక్తికర పరిణామం
  • బరేలీ జిల్లాలో ప్రేమ వివాహాలు
  • మేజర్లు కావడంతో పోలీసుల సమర్థన
  • మద్దతు పలుకుతున్న కాషాయ దళాలు
Two muslim women marries Hindu men in Uttar Pradesh

ఓవైపు లవ్ జిహాద్ పై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బరేలీ జిల్లాలో ఇద్దరు ముస్లిం యువతులు హిందూ వ్యక్తులను పెళ్లాడారు. ఈ పెళ్లి కోసం ఆ యువతులు మతం కూడా మార్చుకున్నారు. పెళ్లి అనంతరం తమకు ప్రాణ రక్షణ కావాలంటూ వారు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు వెంటనే స్పందించి వారికి భద్రత కల్పించారు. అంతేకాదు, కాషాయ దళాలు కూడా వారికి దన్నుగా నిలిచాయి.

మతాంతర వివాహాలు చేసుకున్న ఈ యువతులిద్దరూ బరేలీ జిల్లాలోని హఫీజ్ గంజ్, బహేది ప్రాంతాలకు చెందినవారు. హఫీజ్ గంజ్ ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి ప్రేమ వ్యవహారంలో కిడ్నాప్ కేసు నమోదు కాగా, ఇద్దరూ మైనారిటీ తీరినవారేనని పోలీసులు గుర్తించి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

బహేది ప్రాంతానికి చెందిన ముస్లిం యువతి మంగళవారం తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఒక వీడియో విడుదల చేసింది. తాము గత సెప్టెంరులోనే పెళ్లి చేసుకున్నామని, తాను అంతకుముందే హిందూ మతం స్వీకరించానని వెల్లడించింది. అయితే ఆమె తల్లిదండ్రులు మత మార్పిళ్ల అంశంపై నూతనంగా వచ్చిన చట్టం ప్రకారం ఆ హిందూ యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఆ జంటతో తాము మాట్లాడుతున్నామని, వారిని కోర్టులో హాజరు పరుచుతామని చెప్పారు. పరస్పర అంగీకారం ఉన్నప్పుడు ఇద్దరు మేజర్లు  కలిసి జీవించేందుకు వారికి హక్కు ఉందంటూ గతంలో హైకోర్టు చెప్పిందని, తాము కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని జిల్లా పోలీసు అధికారి సజ్వాన్ తెలిపారు.

More Telugu News