మెల్బోర్న్ లో మెరిసిన భారత బౌలర్లు... ప్రశంసలు కురిపించిన కోహ్లీ

26-12-2020 Sat 16:40
  • మెల్బోర్న్ లో ప్రారంభమైన రెండోటెస్టు
  • 195 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
  • కదం తొక్కిన బుమ్రా, అశ్విన్ సిరాజ్
  • సాలిడ్ గా ముగించారన్న కోహ్లీ
Kohli lauds Indian bowlers after they scalps Aussies wickets in Melbourne test

మెల్బోర్న్ లో ఇవాళ భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. అయితే తొలిరోజు ఆటలో భారత బౌలర్లు హీరోలుగా నిలిచారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే పరిమితం చేశారు. బుమ్రా 4 వికెట్లు తీయగా, అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం అరంగేట్రంలో విశేషంగా రాణించాడు. సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి.

కాగా, తన భార్య అనుష్క శర్మ ప్రసవించనుండడంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును వీడడం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహిస్తున్నాడు. రహానే కెప్టెన్సీలో టీమిండియా బౌలర్లు సమష్టిగా కదం తొక్కారు.

దీనిపై కోహ్లీ స్పందిస్తూ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. మొదటి రోజు ఆటలో మనదే పైచేయి అని పేర్కొన్నాడు. అంతేకాకుండా, టీమిండియా బ్యాట్స్ మెన్ ఎంతో పట్టుదల కనబరిచి తొలిరోజు ఆటను పట్టు జారనివ్వని రీతిలో ముగించారని ప్రశంసించాడు.

ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మిగిలిన మూడు టెస్టుల్లో కోహ్లీ స్థానంలో రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మూడో టెస్టు నాటికి రోహిత్ శర్మ జట్టులో చేరనుండడంతో భారత బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.