NASA: ఒకే రోజు 27 కోతులకు 'నాసా' కారుణ్య మరణం

  • సమాచార స్వేచ్ఛా హక్కు చట్టం రిపోర్టులో వెల్లడి
  • వయసు మీద పడడం వల్లే చంపేసిందని స్పష్టీకరణ
  • గత ఏడాది ఘటన.. భగ్గుమన్న జంతు ప్రేమికులు  
Nasa laboratory humanely euthanized 27 monkeys on single day in 2019

ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకటే రోజు 27 కోతులను అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) చంపేసింది. వాటిని ‘కారుణ్య మరణాలు‘ అని ప్రకటించింది. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరి  2న జరిగింది. అమెరికా సమాచార స్వేచ్ఛా హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా ఈ విషయం బయటకొచ్చింది.

కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న నాసా ఏమిస్ పరిశోధనా కేంద్రంలో ఈ ఘటన జరిగిందని, దానిపై జంతు ప్రేమికులు మండిపడ్డారని ఆ నివేదిక పేర్కొంది. అయితే, కోతులను నాసా పరిశోధనల కోసం వాడుకోలేదని, అవి ముసలివైపోవడం, దాదాపు అన్నీ పార్కిన్సన్ జబ్బు బారిన పడడంతో కారుణ్య మరణాలను ఇచ్చిందని పేర్కొంది. అంతకుముందు వరకూ లైఫ్ సోర్స్ బయోమెడికల్ అనే ప్రైవేట్ ఔషధ పరిశోధన సంస్థతో కలిసి నాసా వాటి బాగోగులను చూసుకుందని వివరించింది.

దీనిపై నాసా, లైఫ్ సోర్స్ బయోమెడికల్ స్పందించింది. తమ దగ్గర గానీ, తమ అధీనంలోని ఏ ఇతర ఫెసిలిటీల్లోగానీ కోతులు లేవని ప్రకటించింది. కోతులకు వయసు మీద పడడం, వాటికి ఎక్కడా నిలువ నీడ ఉండే అవకాశం లేకపోవడంతో గత ఏఢాదే వాటి బాధ్యతలను తీసుకున్నామని లైఫ్ సోర్స్ బయోమెడికల్ డైరెక్టర్ స్టెఫానీ సోలిస్ చెప్పారు. వాటి బాగోగులకు తామే ఖర్చు పెట్టుకున్నామని, చివరకు వృద్ధాప్య దశకు వచ్చిన వాటి దుస్థితిని చూడలేక కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కాగా, 2017లో రికార్డు స్థాయిలో ఔషధ పరిశోధనల కోసం ఒక్క అమెరికాలోనే 74 వేల కోతులను వాడారని 2018 నాటి నివేదిక చెబుతోంది. అయితే, ఆ తర్వాత పరిశోధనల్లో కోతుల వినియోగాన్ని ఆ దేశం తగ్గించేసింది.

More Telugu News