Narendra Modi: ఢిల్లీలో కొంతమంది నాకు ప్రజాస్వామ్యం గురించి బోధించాలనుకున్నారు: ప్రధాని మోదీ

  • ఇండియాలో ప్రజాస్వామ్యమే లేదన్న రాహుల్ గాంధీ
  • జమ్మూకశ్మీర్ డీడీసీ ఫలితాలు చూడాలన్న మోదీ
  • ముందు మీ తప్పిదాలు తెలుసుకోవాలని సూచన
Some In Delhi Try To Teach Me Democracy says modi

తనపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో బోధించాలనుకున్నారని చెప్పారు. ఇటీవలే రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇండియాలో ప్రజాస్వామ్యమే లేదని... ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా అవసరమైతే టెర్రరిస్టుగా చిత్రీకరిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ తన శైలిలో ప్రతిస్పందించారు.

ఢిల్లీలో కొందరు వ్యక్తులు ఉన్నారని.. వారు అన్ని వేళలా తనను కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన పాఠాలను తనకు బోధించాలని అనుకుంటూ ఉంటారని దెప్పిపొడిచారు. ఇలాంటి వారికి జమ్మూకశ్మీర్ లో జరిగిన డిస్ట్రిక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను తాను చూపించాలనుకుంటున్నానని అన్నారు.

తనకు ప్రజాస్వామ్యం గురించి నేర్పించాలనుకుంటున్నవారు... వారి తప్పిదాలను ముందు తెలుసుకోవాలని మోదీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన జమ్మూకశ్మీర్ ఓటర్లకు తాను ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. స్థానిక ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ లోని యువత, వృద్ధులు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున తరలి రావడాన్ని తాను చూశానని చెప్పారు. డీడీసీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు మన ప్రజాస్వామ్య పునాదులు ఎంత బలంగా ఉన్నాయన్న విషయాన్ని తమ ఓటింగ్ ద్వారా చాటి చెప్పారని అన్నారు.

More Telugu News