China: 2028 నాటికి అగ్రరాజ్యంగా చైనా.. అమెరికాను వెనక్కు నెట్టేస్తున్న వైనం!

  • ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని మేధో సంస్థ నివేదిక
  • 2030 నాటికి మూడో స్థానంలో ఇండియా
  • జపాన్ ను కిందకు నెట్టేసి మరింత ముందుకు
  • అమెరికా ఆర్థిక వృద్ధి భారీగా పడిపోతుందని అంచనా
China To Overtake US As Worlds Biggest Economy By 2028 Report

అగ్రరాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేది అమెరికా. ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉన్న ఆ దేశం మరికొన్నేళ్లలో అగ్రరాజ్య హోదాను కోల్పోబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అగ్రరాజ్య కిరీటాన్ని అమెరికా నుంచి తీసేసుకునేందుకు చైనా వడివడిగా దూసుకొచ్చేస్తోంది. 2028లో అమెరికాను దాటేసి చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని ఓ నివేదిక అంచనా వేసింది.

సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అనే మేధో సంస్థ శనివారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతుల విషయాలను వెల్లడించింది. రాబోయే రోజుల్లో అధికారం, ఆర్థిక రంగాల్లో అమెరికా, చైనా మధ్య పోటాపోటీ తప్పదని చెప్పింది. అమెరికాలో ప్రస్తుతమున్న కొవిడ్ 19 పరిస్థితులు, దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థలే చైనాకు అనుకూల పరిస్థితులను కల్పిస్తాయని పేర్కొంది.  

చైనా పెట్టిన కఠినమైన లాక్ డౌన్లు..  మహమ్మారిని త్వరగా అదుపు చేయడానికి దోహదపడ్డాయని వివరించింది. దాని వల్ల అక్కడ ఆర్థిక రంగం పుంజుకుంటోందని నివేదికలో పేర్కొంది. 2021-25 మధ్య చైనాలో 5.7 శాతం మేర ఆర్థిక వృద్ధి నమోదవుతుందని, అయితే, 2026-2030 మధ్య మాత్రం 4.5 శాతానికి పడిపోతుందని పేర్కొంది.

అదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకున్నాక 2021లో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని, కానీ, ఆ తర్వాత మరింత దిగజారుతుందని హెచ్చరించింది. 2022 నుంచి 2024 మధ్య ఏటా అమెరికా వృద్ధి 1.9 శాతానికి పడిపోతుందని, ఆ తర్వాత 1.6 శాతానికి దిగివస్తుందని వివరించింది.  

2030 వరకు జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే, ఆ ఏడాది ప్రారంభంలో ఇండియా.. జపాన్ ను దాటేసి ముందుకు వస్తుందని, జర్మనీ నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్.. 2024 నుంచి ఆరోస్థానానికి దిగజారుతుందని పేర్కొంది. బ్రెగ్జిట్ డీల్ తో ఐరోపా సమాఖ్య నుంచి బయటకొచ్చినా.. 2035 నాటికి బ్రిటన్ ఆర్థిక వృద్ధి ఫ్రాన్స్ కన్నా 23 శాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పింది.

More Telugu News