Central Universities: సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాలకూ జాతీయ స్థాయి కామన్ టెస్ట్

  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహణకు కేంద్రం నిర్ణయం
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు కసరత్తులు
  • విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ
  • ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు
Common test for admission to central universities from 2021

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో (సెంట్రల్ యూనివర్సిటీ) డిగ్రీ ప్రవేశాలకూ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని భావిస్తోంది.

ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెంట్రల్ వర్సిటీల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తున్నారు. అయితే, దాని వల్ల చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఆధ్వర్యంలో ఆన్ లైన్ కామన్ టెస్ట్ పెట్టాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది.

ఆ పరీక్షకు సంబంధించిన విధివిధానాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని ఆదేశిస్తూ ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి కామన్ టెస్ట్ ను నిర్వహిస్తామని, సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలతో పాటు జనరల్ ఆప్టిట్యూడ్ కూడా ఉంటుందని కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్ ఖారే చెప్పారు.

కామన్ టెస్టుకు సంబంధించి కమిటీ ఒక నెలలో నివేదిక ఇస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ డీపీ సింగ్ వెల్లడించారు. కామన్ టెస్టు వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని, అభ్యర్థులు ఎక్కువ పరీక్షలు రాసే బాధను తప్పిస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెస్టులో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలతో పాటు వెర్బల్, క్వాంటిటేటివ్ ఏబిలిటీ, లాజికల్ రీజనింగ్ నుంచీ ప్రశ్నలు ఉంటాయన్నారు.

కాగా, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఆర్ పీ తివారీ చైర్ పర్సన్ గా కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ, దక్షిణ బిహార్, మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉపకులపతులు, ఎన్టీయే డైరెక్టర్ జనరల్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శులను సభ్యులుగా నియమించారు.

More Telugu News